ప్లాయిడ్ హత్యకు కారణమైన పోలీసుకి దిమ్మ తిరిగే శిక్ష

అగ్రరాజ్యమైన అమెరికాను ఒక ఊపు ఊపేయటమే కాదు.. తిరుగులేని అధికారాన్ని చెలాయిస్తున్న ట్రంప్ సర్కారుకు చుక్కలు చూపించిన ఉదంతాల్లో నల్లజాతీయుడు జార్జి ప్లాయిడ్ అమానుష హత్య ఒకటిగా చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ పోలీసుల అధికారి చర్యపై విమర్శలు వెల్లువెత్తాయి. తానేం తప్పు చేయలేదని.. తనను వదిలేయాలని కోరటమేకాదు.. తాను ఊపిరి పీల్చుకోలేకపోతున్నట్లుగా విలవిలలాడినప్పటికీ..కర్కసంగా వ్యవహించిన పోలీసులు అధికారి డెరిక్ చౌవిన్ కు సంచలన శిక్షను ఖరారు చేసింది కోర్టు.

సూపర్ మార్కెట్ కు వెళ్లి వస్తున్న ప్లాయిడ్ ను నకిలీ కరెన్సీని మారుస్తున్నట్లుగా ఆరోపణలు చేసి.. అతడ్ని అదుపులోకి తీసుకునే పేరుతో.. దారుణంగి హింసించిన వైనం ఫోటోలతోపాటు.. కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. అమెరికాలో నల్లజాతీయుల విషయంలో శ్వేతజాతి పోలీసులు ఎంత దారుణంగా వ్యవహరిస్తారో ఈ ఉదంతం ప్రపంచానికి తెలియజేసింది. ఈ ఉదంతంపై అమెరికన్లు పెద్ద ఎత్తున ఆగ్రహావేశాల్ని వ్యక్తం చేశారు.

భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్థరాత్రి.. దోషిగా నిరూపితమైన పోలీసు అధికారి డెరిక్ చౌవిన్ కు శిక్షను ఖరారు చేసింది అమెరికన్ న్యాయస్థానం. అతడికి 22.5ఏళ్ల శిక్షా కాలాన్ని విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. అంటే.. 270 నెలల పాటు జైలుశిక్షను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. శ్వేతజాతీయుడి దుర్మార్గానికి తగిన శిక్ష వేసిన కోర్టు తీర్పుపై పలువురు పాజిటివ్ గా రియాక్టు అవుతున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందని వ్యాఖ్యానిస్తున్నారు.