సందీప్ సినిమా గొడవేంటి?

సందీప్ సినిమా గొడవేంటి?

గత రెండు మూడేళ్లలో యువ కథానాయకుడు సందీప్ కిషన్ సినిమాలేవీ తెలుగులో పెద్దగా ఆడలేదు. కానీ తమిళంలో మాత్రం అతను అడపా దడపా విజయాలందుకుంటున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో ‘మానగరం’ అతడి మంచి విజయాన్నందించగా.. ఇటీవలే ‘మాయవన్’ అనే సినిమాతో ఇంకో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు సందీప్. ఈ సినిమానే ‘ప్రాజెక్ట్ జడ్’ పేరుతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఐతే ఈ చిత్ర తెలుగు నిర్మాతతో ఎక్కడ తేడా కొట్టిందో కానీ.. సందీప్ ఈ సినిమాతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నాడు. శుక్రవారం సినిమా రిలీజవుతుంటే.. దీని గురించి తన ట్విట్టర్ అకౌంట్లో ఒక మెసేజ్ కూడా పెట్టలేదు సందీప్. అసలీ సినిమాకు ప్రమోషన్లే లేవసలు. నామమాత్రంగా చాలా తక్కువ థియేటర్లలో ‘ప్రాజెక్ట్ జడ్’ రిలీజైంది.

ఇదిలా ఉంటే.. ‘ప్రాజెక్ట్ జడ్’లో సందీప్ కిషన్ సొంత గొంతు వినిపించట్లేదట. ఎవరో అతడి పాత్రకు డబ్బింగ్ చెప్పారట. మొత్తంగా డబ్బింగ్ సరిగా జరగలేదని అంటున్నారు. దీంతో సందీప్ ఈ సినిమాను ఇలా ప్రదర్శించడంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కూడా గుసగుసలు వినిపించాయి. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ‘ప్రాజెక్ట్ జడ్’ నిర్మాత శనివారం రాత్రి కొందరు సినీ ప్రముఖుల్ని పిలిచి.. మీడియా వాళ్లనూ రప్పించి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని దేవి థియేటర్లలో స్పెషల్ షో వేస్తున్నట్లు సమాచారం. ఈ షో అయ్యాక ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమాకు సంబంధించిన వివాదాలపై వివరణ ఇస్తారని సమాచారం. అప్పుడు సందీప్ గురించి నిర్మాత ఏం మాట్లాడతాడో.. తర్వాత సందీప్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు