‘పద్మావతి’కి 26 సెన్సార్ కట్స్?

‘పద్మావతి’కి 26 సెన్సార్ కట్స్?

డిసెంబరు 1నే విడుదల కావాల్సిన సినిమా ‘పద్మావతి’. కానీ ఈ సినిమా చుట్టూ పెద్ద పెద్ద వివాదాలు ముసురుకోవడంతో విడుదల ఆగిపోయింది. ఇప్పటిదాకా ఏ సినిమాకూ లేని స్థాయిలో దీనిపై వ్యతిరేకత వ్యక్తమైంది కొన్ని వర్గాల్లో. సెన్సార్ బోర్డు సైతం ఈ చిత్ర దర్శక నిర్మాత సంజయ్ లీలా బన్సాలీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ కంటే ముందు మీడియాకు సినిమా చూపించడాన్ని తప్పుబట్టింది. చివరికి పార్లమెంటరీ కమిటీ వరకు వ్యవహారం వెళ్లింది. ఇటీవలే ఈ సినిమాకు క్లియరెన్స్ ఇచ్చేందుకు కొందరు ప్రముఖులతో కమిటీ వేస్తున్నట్లుగా కూడా వార్తలొచ్చాయి. ఆ కమిటీ సంగతి ఎంతవరకు వచ్చిందో ఏమో కానీ.. కేంద్ర సెన్సార్ బోర్డు ఈ చిత్రాన్ని సర్టిఫై చేయడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలొచ్చాయి.

ఈ విషయంలో దర్శక నిర్మాత సంజయ్ లీలా బన్సాలీకి సెన్సార్ బోర్డు కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. వారి సూచనల ప్రకారం ఈ సినిమా టైటిల్ మార్చాలట. అలాగే ఈ సినిమా ఎవరినీ ఉద్దేశించింది కాదంటూ సినిమా ఆరంభంలో, ఇంటర్వెల్‌లో డిస్క్లైమర్ వేయాలట. దీంతో పాటు సినిమాలో మొత్తంగా 26 కట్స్ కూడా సూచించిందట సెన్సార్ బోర్డు. ఐతే డిస్క్లైమర్ వేయడం సమస్య కాదు. టైటిల్ మార్చడం వల్ల ఇబ్బందే కానీ.. తప్పదనుకుంటే ఆ పని కూడా చేస్తారు. కానీ ఏకంగా 26 కట్స్ అంటే.. సినిమా కిల్ అయిపోవడం ఖాయం. ఈ చిత్ర ట్రైలర్ చూస్తే ఒక దృశ్య కావ్యం చూడబోతున్న భావన కలిగించింది. అంత గొప్పగా కనిపించాయి విజువల్స్. మరి 26 చోట్ల కట్స్ వేస్తే సినిమా ఏం మిగులుతుందన్నది ప్రశ్నార్థకం. దీనిపై బన్సాలీ ఏమంటాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు