సునీల్.. పట్టు వదలట్లేదే

సునీల్.. పట్టు వదలట్లేదే

సునీల్‌ను హీరోగా కంటే కమెడియన్‌గా చూడటానికే జనాలు ఎక్కువ ఇష్టపడతారనే విషయంలో మరో వాదన లేదు. అతను కామెడీ టచ్ ఉన్న హీరో క్యారెక్టర్లు చేసినపుడు జనాలకు ఇబ్బందిగా ఏమీ అనిపించలేదు. ‘అందాల రాముడు’.. ‘మర్యాదరామన్న’ వరకు అతను సరైన ట్రాక్‌లోనే ఉన్నాడు. కానీ తర్వాత రెగ్యులర్ మాస్ హీరోలా విన్యాసాలు చేసేసరికి తేడా కొట్టేసింది. వరుస ఫ్లాపులు వస్తున్నా అతడిలో పెద్దగా మార్పు కనిపించలేదు. గత కొన్నేళ్లుగా సునీల్ సినిమాలు చూస్తుంటే అతను కామెడీ వదిలేసి పెద్ద తప్పు చేశాడనే ఫీలింగ్ అంతకంతకూ పెరిగిపోతోంది. కానీ సునీల్ మాత్రం తాను హీరోగా కొనసాగడం పట్ల ఏమాత్రం రిగ్రెట్స్ లేనట్లే మాట్లాడుతున్నాడు. హీరోగానే తనకు కంఫర్ట్‌గా ఉన్నట్లు చెబుతున్నాడు.

తన కొత్త సినిమా ‘2 కంట్రీస్’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన సునీల్.. హీరో కావడం వల్ల తాను నష్టపోయిందేమీ లేదని అన్నాడు. కమెడియన్‌గా ఉన్నపుడు రోజుకు రెండు మూడు సినిమాల్లో నటించడం వల్ల ఒత్తిడి ఎదుర్కొనేవాడినని.. హీరో అయ్యాక ఆ టెన్షన్ పోయిందని.. ఫ్యామిలీలో ఎక్కువ సమయం గడుపుతున్నానని అన్నాడు. హీరోగా తన కెరీర్లో ఎక్కువ ఫెయిల్యూర్లేమీ లేవని.. కేవలం ‘ఈడు గోల్డ్ ఎహే’.. ‘ఉంగరాల రాంబాబు’ మాత్రమే ఆడలేదని సునీల్ అన్నాడు. మళ్లీ కామెడీ వేషాల్లోకి వెళ్లబోతున్నానని.. కమెడియన్‌గా మూడు సినిమాలు చేస్తానని.. అలాగని హీరో వేషాలు వదిలేయట్లేదని.. హీరోగా మూడు సినిమాలు చేయనున్నానని సునీల్ తెలిపాడు. ఐతే ఫ్యామిలీతో గడిపే సమయం దొరకడం బాగుంది కానీ.. హీరోగా వరుస ఫెయిల్యూర్లతో ప్రేక్షకులకు ఎంత దూరమైంది సునీల్ గుర్తించాడా? ‘మిస్టర్ పెళ్లికొడుకు’తో మొదలుపెట్టి.. ‘ఉంగరాల రాంబాబు’ వరకు సునీల్ గత నాలుగేళ్లలో చేసిన ప్రతి సినిమా ఫ్లాపే. ఆ సంగతి అంగీకరించకుండా రెండు మాత్రమే ఫ్లాపనడం తనను తాను మోసం చేసుకోవడం కాదా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు