చరిత్ర తిరగరాస్తున్న నాని

చరిత్ర తిరగరాస్తున్న నాని

తెలుగు ప్రేక్షకులందు ఓవర్సీస్ తెలుగు ప్రేక్షకులు వేరు. వాళ్ల అభిరుచులు కొంచెం భిన్నంగా ఉంటాయి. అక్కడి వాళ్లు క్లాస్ టచ్ ఉన్న.. కొత్తగా అనిపించే సినిమాలకే ఎక్కువగా పట్టం కడుతుంటారు. రొటీన్ అన్న ముద్ర పడితే ఆ సినిమాల జోలికి వెళ్లరు. రివ్యూలు ఎక్కువగా ప్రభావం చూపేది అక్కడి ప్రేక్షకుల మీదే. థియేటర్లు ఎక్కడెక్కడో ఉంటాయి. పైగా టికెట్ల రేట్లు ఎక్కువ. కాబట్టి తాము పెట్టే డబ్బులకు, సమయానికి సరైన ఫలితం ఉండాలని రివ్యూలు చూసుకున్నాకే సినిమాలకు వెళ్తారు అక్కడి జనాలు. సాధారణంగా రేటింగ్స్ తక్కువ పడినా.. సమీక్షకులు రొటీన్ అని తేల్చేసినా వాళ్లు సినిమాలకు వెళ్లరు. దీంతో ప్రిమియర్ షోలు అవ్వగానే ప్రభావం కనిపిస్తుంది. తొలి రోజు.. రెండో రోజుకే వసూళ్లు పడిపోతాయి.

ఐతే నాని సినిమా ‘ఎంసీఏ’కు తక్కువ రేటింగ్స్ వచ్చినా.. రొటీన్ అన్న ముద్ర వేయించుకున్నా ఓవర్సీస్ ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షిస్తోంది. ప్రిమియర్లతో కలుపుకుని రెండో రోజుకే హాఫ్ మిలియన్ మార్కును దాటేసిన ‘ఎంసీఏ’.. ఆదివారం కూడా లక్ష డాలర్లకు పైగా వసూలు చేసింది. సోమ, మంగళవారాల్లో కూడా స్టడీగానే నిలబడింది. ఇప్పటికే 8.2 లక్షల డాలర్ల దాకా వసూలు చేసిన ఈ చిత్రం మిలియన్ మార్కు దిశగా అడుగులేస్తోంది. పోటీగా వచ్చిన ‘హలో’ ఓవర్సీస్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గ సినిమా అయినా.. దాన్నుంచి గట్టి పోటీ ఉన్నా.. ‘ఎంసీఏ’ అక్కడ నిలబడటం ఆశ్చర్యం కలిగించే విషయమే. ప్రథమార్ధంలో ఓ మోస్తరుగా అనిపించే క్లీన్ ఎంటర్టైన్మెంట్‌కే యుఎస్ ఆడియన్స్ సంతృప్తి పడిపోయినట్లున్నారు. నాని అక్కడి మార్కెట్లో ఎంతటి పట్టు సంపాదించాడో చెప్పడానికి ఇది రుజువు. ‘భలే భలే మగాడివోయ్’తో మొదలుపెడితే.. నాని నుంచి వచ్చిన ప్రతి సినిమా అక్కడ మినిమం ముప్పావు మిలియన్ డాలర్లు వసూలు చేయడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English