ఆర్పీ సలహాను చక్రి పాటించి ఉంటే..

ఆర్పీ సలహాను చక్రి పాటించి ఉంటే..

చక్రి.. తెలుగు సినీ సంగీత ప్రియులు అంత సులువుగా మరిచిపోలేని పేరు. ఒకటి రెండు కాదు.. ఐదు పది కాదు.. అతడి కెరీర్లో చెప్పుకోవడానికి ఎన్నో స్పెషల్ ఆల్బమ్స్ ఉన్నాయి. అంత మంచి సంగీత దర్శకుడు నాలుగు పదుల వయసు దాటకుండానే హఠాత్తుగా చనిపోవడం అందరినీ కలచివేసింది.

 ఊబకాయం విషయంలో కొన్నేళ్ల ముందు నుంచే అతడి పరిస్థితి ప్రమాదకరంగా కనిపిస్తున్నప్పటికీ అప్రమత్తం కాకపోవడంతో ప్రాణాలే పోగొట్టుకున్నాడు. ఈ విషయంలో ఎంతమంది నిట్టూర్చారో.. ఎంత ఆవేదన చెందారో?  చక్రికి అత్యంత సన్నిహితుడైన మరో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ కూడా ఈ విషయంలో ఇప్పటికీ ఆవేదన చెందుతున్నాడు. తాను చెప్పిన సలహాను చక్రి పాటించి ఉన్నా అతను బతికేవాడంటూ ఆర్పీ తాజాగా ఒక కార్యక్రమంలో అన్నాడు.

‘‘చక్రిని నా సోల్ మేట్ అంటాను. కేవలం ఊబకాయం వల్లే అతను చనిపోయాడు. ఈ విషయంలో నేను స్వయంగా అతడిని అప్రమత్తం చేసే ప్రయత్నం చేశాను. సింగపూర్లో బరువు తగ్గేందుకు ఏదో టెక్నిక్ ఉందని తెలిసి చక్రికి అది ట్రై చేయమని చెప్పాను. సరే వెళ్తాను అన్నాడు. కానీ వెళ్లలేదు. మళ్లీ ఇంకోసారి చెప్పాను. చాలా పనులు ఉన్నాయని.. అవి చూసుకుని వెళ్తానని అన్నాడు. నువ్వు వెళ్లు.. నీ పనులన్నీ నేను చేసి పెడతా అని మళ్లీ గట్టిగా చెప్పాను. సరే వెళ్తాను అన్నాడు. కానీ వెళ్లలేదు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. బరువు తగ్గించుకుని ఉంటే ఈ రోజు మన మధ్య అందరిలా ఉండేవాడు. తన సంగీతంతో అలరిస్తూ ఉండేవాడు. మేమిద్దరం ఒకే సమయంలో చాలా సినిమాలు చేస్తున్నప్పటికీ పోటీ ఉండేది కాదు. మంచి స్నేహితుల్లా కొనసాగేవాళ్లం’’ అని ఆర్పీ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు