ఒక్క క్షణం కాపీ..? దర్శకుడి ఆగ్రహం

ఒక్క క్షణం కాపీ..? దర్శకుడి ఆగ్రహం

'ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన తమిళ దర్శకుడు వీఐ ఆనంద్. ఈ చిత్రం మన ఆడియన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంది. దీని తర్వాత ఆనంద్ తీసే సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తికి తగ్గట్లే ప్యారలల్ లైఫ్ అనే విభిన్నమైన కాన్సెప్ట్ నేపథ్యంలో ‘ఒక్క క్షణం’ సినిమా తీశాడు ఆనంద్. ఈ చిత్ర టీజర్ చూశాక అందరిలోనూ సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. ఐతే ఇంతలోనే ఈ చిత్రం కొరియన్ మూవీ ‘ప్యారలల్ లైఫ్’కు కాపీ అన్న ఆరోపణలు వినిపించాయి. ఆ సినిమాను ‘2 మేమిద్దరం’ పేరుతో రీమేక్ చేస్తున్న నిర్మాత అనిల్ సుంకర లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కూడా సిద్ధమైనట్లు వార్తలొచ్చాయి. ఐతే ఇరు వర్గాలు ఓ అండర్‌స్టాండింగ్‌కు రావడంతో ఈ వివాదం త్వరగానే సమసిపోయింది.

ఐతే జనాల్లో మాత్రం ‘ఒక్క క్షణం’ విషయంలో సందేహాలు తొలగిపోలేదు. ఈ విషయమై ఇప్పటికే హీరో అల్లు శిరీష్ క్లారిటీ ఇవ్వగా.. ఇప్పుడు దర్శకుడు ఆనంద్ లైన్లోకి వచ్చాడు. ‘ఒక్క క్షణం’ కాపీ అనే ఆరోపణలపై ఆయన కొంచెం సీరియస్‌గానే స్పందించాడు. ప్యారలల్ లైఫ్ అనేది ఒక కాన్సెప్ట్ అని.. అది వంద ఏళ్ల ముందు నుంచే చర్చనీయాంశంగా ఉంటున్నాయని.. దీనిపై ఎన్నో థియరీలున్నాయని.. అలాంటపుడు ఎవరికీ దానిపై ఐడియాలు రావా.. సినిమాలు తీయరా అని ఆనంద్ ప్రశ్నించాడు. తాను ఇంతకుముందు దయ్యం కథతో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ తీశానని.. అలాగని అంతకుముందు వచ్చిన దయ్యం సినిమాల్ని కాపీ కొట్టినట్లా అని ఆనంద్ అడిగాడు. సైన్స్‌లో ఉన్న ఒక కాన్సెప్ట్ మీద ఎవరైనా సినిమాలు తీయొచ్చని.. అంతమాత్రాన కాపీ అనడానికి వీల్లేదని.. తమ చిత్రానికి ‘ప్యారలల్ లైఫ్’కు సంబంధం లేదనే విషయం ఈ నెల 28న తేలుతుందని ఆనంద్ ధీమా వ్యక్తం చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు