ఇక ఆ సినిమానే బాహుబలిని కొట్టాలి

ఇక ఆ సినిమానే బాహుబలిని కొట్టాలి

బాహుబలి చిత్రం రికార్డులని తెలుగులో అయితే ఇప్పట్లో కొట్టడం కష్టమే. అందుకే 'నాన్‌-బాహుబలి' అంటూ ఒక పేరు పెట్టుకుని రెండవ స్థానం కోసం పోటీ జరుగుతోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. బాహుబలిని అనువాద చిత్రంగా పరిగణించి దాని రికార్డులని కాకుండా అచ్చమైన హిందీ సినిమాల రికార్డులనే పరిగణిస్తూ అక్కడి ట్రేడ్‌ విశ్లేషకులు వార్తలు రాస్తున్నారు. ఒక అనువాద చిత్రం పేరిట బాలీవుడ్‌ రికార్డులున్నాయనేది మాత్రం విస్మరిస్తున్నారు. ఎలా చూసినా బాహుబలి రికార్డుని కొట్టడం బాలీవుడ్‌ బడా స్టార్ల వల్ల కూడా కావడం లేదు.

బాహుబలి 2 వచ్చాక సల్మాన్‌ఖాన్‌వి రెండు సినిమాలు రాగా, పూర్తి రన్‌ రికార్డులు అటుంచి కనీసం ఫస్ట్‌ డే, ఫస్ట్‌ వీకెండ్‌ వసూళ్లని కూడా కొట్టలేకపోయాడు. షారుక్‌ పరిస్థితి అయితే మరీ దారుణంగా వుంది. కనీసం వంద కోట్ల వసూళ్లు సాధించడమే అతని సినిమాలకి గగనమైపోతోంది. దీంతో ఇక బాహుబలి రికార్డు మీద కన్నేయాలంటే అమీర్‌ఖాన్‌ చేస్తోన్న థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌ వల్లే అవుతుందనిపిస్తోంది.

అది కూడా భారీ నిర్మాణ విలువలున్న జానపద చిత్రం కావడంతో బాహుబలి మాదిరి క్రేజ్‌ వస్తుందని, ఖచ్చితంగా బాహుబలి లెవల్లో బాక్సాఫీస్‌ వద్ద సంచలనాలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక ఈలోగా వచ్చే ఏ ఇతర సినిమా వల్ల ఆ రికార్డులు బ్రేక్‌ అవడం అసాధ్యమనే అనిపిస్తోంది. తెలుగులో అయితే మళ్లీ రాజమౌళి పూనుకుంటే తప్ప ఈ రికార్డుల గురించి ఆలోచించనక్కర్లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు