గుణశేఖర్ సినిమాలో హీరో ఫిక్సయ్యాడు

గుణశేఖర్ సినిమాలో హీరో ఫిక్సయ్యాడు

‘రుద్రమదేవి’ సినిమాతో పెద్ద సాహసమే చేశాడు గుణశేఖర్. దర్శకుడిగా అతడి ఫామ్ ప్రకారం చూస్తే ఓ చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా తలపెట్టడమే పెద్ద సాహసం. పైగా అది లేడీ ఓరియెంటెడ్ మూవీ. అందులోనూ దానికి ఏకంగా రూ.70 కోట్ల దాకా బడ్జెట్ పెట్టేశాడు. చాలామంది గుణశేఖర్ ఈ దెబ్బతో మునిగిపోతాడని.. ఇక సినిమాలు ఆపేయాల్సిన పరిస్థితికి వస్తాడని అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా ‘రుద్రమదేవి’ అంచనాల్ని మించి ఆడేసింది. గుణశేఖర్‌ను చాలా వరకు బయటపడేసింది. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో మళ్లీ ఇంకో చారిత్రక నేపథ్యం ఉన్న సినిమానే చేయడానికి ఫిక్సయ్యాడు గుణశేఖర్. ఆ సినిమానే.. హిరణ్యకశిపుడు.

ఐతే ఈ చిత్రంలో హీరోగా ఎవరు నటిస్తారన్నదే స్పష్టత లేకపోయింది. జూనియర్ ఎన్టీఆర్ అంటూ ముందు ప్రచారం జరిగింది. తర్వాత ‘రుద్రమదేవి’లో కీలక పాత్ర చేసిన రానా దగ్గుబాటి పేరు తెరమీదికి వచ్చింది. ఇప్పుడు స్వయంగా రానానే ఈ విషయంలో స్పష్టత ఇచ్చాడు. తాను ‘హిరణ్యకశిపుడు’ సినిమా చేయబోతున్నానని.. వచ్చే ఏడాది చివర్లో ఈ చిత్రం మొదలయ్యే అవకాశముందని అన్నాడు. దేశవ్యాప్తంగా మార్కెట్ సంపాదించుకుని.. మాంచి ఊపులో కొనసాగుతున్న రానా ‘హిరణ్యకశిపుడు’ చేయడానికి అంగీకరించడం గుణశేఖర్‌కు ఉత్సాహాన్నిచ్చేదే. ఈ చిత్రంతో పాటుగా తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ఏనుగుల నేపథ్యంలో సాగే సినిమాను కూడా చేయబోతున్నట్లు రానా ధ్రువీకరించాడు. అలాగే మార్తాండ వర్మ అనే రాజు కథతో తెరకెక్కే సినిమా కూడా తన నుంచి వస్తుందని రానా చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English