విజయ్ దేవరకొండకు అక్కడ అంత క్రేజా?

విజయ్ దేవరకొండకు అక్కడ అంత క్రేజా?

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒక్క సినిమాతో విజయ్ లాగా ఇంత పేరు సంపాదించిన హీరోలు అరుదే. ‘అర్జున్ రెడ్డి’తో కేవలం తెలుగులోనే కాదు.. సౌత్ ఇండియా అంతటా పాపులర్ అయ్యాడు విజయ్. ముఖ్యంగా తమిళనాట అతడికి చాలా మంచి పేరు వచ్చింది.

‘అర్జున్ రెడ్డి’ సినిమాను చెన్నైలోని తెలుగు వాళ్లతో పాటు తమిళ ప్రేక్షకులు కూడా పెద్ద స్థాయిలోనే చూశారు. తమిళ ఇండస్ట్రీ ప్రముఖులు స్వచ్ఛందంగా ‘అర్జున్ రెడ్డి’ మీద.. విజయ్ మీద ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సినిమా బాగా ఆడుతున్న సమయంలోనే రీమేక్ తెరమీదికి రావడంతో దీని ప్రదర్శన ఆపేయాల్సి వచ్చింది.
ఐతే ‘అర్జున్ రెడ్డి’తో వచ్చిన గుర్తింపుతో విజయ్ తమిళంలో ఓ పెద్ద అవకాశం పట్టేయడం విశేషం. సూర్య కజిన్, స్టార్ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా.. విజయ్‌ను పెట్టి తమిళంలో నేరుగా ఓ సినిమాను నిర్మించబోతుండటం విశేషం.

‘అరుమా నంబి’ అనే సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమై.. ఆ తర్వాత విక్రమ్ హీరోగా ‘ఇంకొక్కడు’ సినిమా తీసిన ఆనంద్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. కొంచెం పెద్ద బడ్జెట్లోనే ఈ సినిమా తెరకెక్కనుందట. ఓ తెలుగు యువ కథానాయకుడితో ఇలా ఓ పెద్ద తమిళ నిర్మాత తమిళంలో సినిమా చేయడానికి ముందుకు రావడం విశేషమే. ఐతే తెలుగులో ఇప్పటికే అరడజనుకు పైగా కమిట్మెంట్లతో ఉన్న విజయ్.. తమిళంలో డైరెక్ట్ సినిమాకు ఎలా డేట్లు కేటాయిస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు