శరత్‌ మరార్‌పై పవన్‌ నిప్పులు!

శరత్‌ మరార్‌పై పవన్‌ నిప్పులు!

అజ్ఞాతవాసి నిర్మాత రాధాకృష్ణపై పవన్‌కళ్యాణ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇలాంటి నిర్మాతలు అరుదైపోయారని అన్నాడు. బయ్యర్ల శ్రేయస్సుని కోరే ఇలాంటి నిర్మాతలు మరింతమంది రావాలని అభిలషించాడు.

అదే సమయంలో ఈమధ్య కాలంలో వస్తోన్న నిర్మాతల లాభాపేక్ష పట్ల పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఏ సినిమా అయినా జనాలని రంజింపచేయాలనే చేస్తామని, తమ సినిమా వల్ల ఎవరూ నష్టపోకూడదనే అనుకుంటామని, ఒకవేళ ఎవరైనా తన సినిమాలతో నష్టపోతే తాను పారితోషికం కూడా తిరిగి ఇచ్చేస్తుంటానని, అయితే తనతో పని చేసిన కొందరు నిర్మాతలు ఆ తరహాలో ఆలోచించలేదని పవన్‌ పరోక్షంగా శరత్‌ మరార్‌కి చురకలు వేసాడు.

సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ ఫ్లాప్‌ అయినపుడు ఆ చిత్రం బయ్యర్లని ఆదుకునేందుకు గాను పవన్‌ కాటమరాయుడు చేసాడు. ఈ చిత్రాన్ని తక్కువ రేట్లకి అదే బయ్యర్లకి ఇవ్వాలనేది పవన్‌ ఆలోచన. కానీ కాటమరాయుడు చిత్రాన్ని వేరే బయ్యర్లకి మరింత లాభాలకి అమ్మేసారు. దాంతో సర్దార్‌ బయ్యర్లు నష్టాల నుంచి బయట పడకపోగా, కాటమరాయుడుతో కొత్తగా మరికొందరు నష్టపోయారు. ఈ రెండు చిత్రాలకీ పవన్‌ తన పారితోషికంలో కొంత తిరిగి ఇచ్చినా కానీ అది బాధితులకి చేరిందో లేదో కూడా తెలియదు.

శరత్‌ మరార్‌తో వరుసగా సినిమాలు చేసిన పవన్‌ అతడిని ఇప్పుడు దూరం పెట్టాడు. అతను ప్రస్తుతం అనువాద చిత్రాలని కొంటూ బిజీగా వున్నాడు. అతని పేరు చెప్పకపోయినప్పటికీ పవన్‌ ఇంత ఘాటుగా మాట్లాడింది అతని గురించేనని అంతా మాట్లాడుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు