‘ఓం నమో..’ అనుభవాలు మరిచిపోయారా?

 ‘ఓం నమో..’ అనుభవాలు మరిచిపోయారా?

సంక్రాంతికో.. దసరాకో.. వేసవికో ఒకేసారి ఎక్కువ సినిమాలు పోటీ పడటంలో అర్థం ఉంది. ఆ సమయాల్లో సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. జనాలు థియేటర్లకు బాగానే వస్తారు. కానీ అన్ సీజన్ అయిన ఫిబ్రవరిలో ఒకే తేదీ కోసం చాలా సినిమాలు పోటీ పడటం మాత్రం అర్థం కాని విషయమే. ఒకటి రెండు కాదు.. ఏకంగా ఐదు సినిమాలు ఒకే తేదీకి రేసులో నిలుస్తుండటం ఊహకందని విషయం. ఆ తేదీ మరేదో కాదు.. ఫిబ్రవరి 9.

ఇప్పటికే వరుణ్ తేజ్ ‘తొలి ప్రేమ’.. నిఖిల్ ‘కిరాక్ పార్టీ’.. బెల్లంకొండ శ్రీనివాస్ ‘సాక్ష్యం’ ఫిబ్రవరి 9కి రేసులో నిలిచాయి. వీటికి తోడు మోహన్ బాబు తన కొత్త సినిమా ‘గాయత్రి’ని కూడా అదే తేదీకి ఫిక్స్ చేశాడు. ఇవి చాలవన్నట్లు నాగశౌర్య-సాయి పల్లవి కాంబినేషన్లలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం ‘కణం’ను కూడా అదే తేదీకి రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు సాయిధరమ్ తేజ్-వి.వి.వినాయక్ కాంబినేషన్లో రాబోతున్న రానున్న సినిమాను కూడా ఫిబ్రవరి 9న రిలీజ్ చేసే అవకాశాలున్నట్లు వార్తలొస్తున్నాయి.

ఫిబ్రవరి 9వ తేదీ కోసం ఎగబడుతున్న వాళ్లందరూ ఒకసారి ఈ ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలి. అక్కినేని నాగార్జున నటించిన భక్తి రస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’ ఆ సమయంలోనే రిలీజై దారుణమైన ఫలితాన్నందుకుంది. జనవరి తర్వాత స్టూడెంట్స్ అందరూ చదువులో పడిపోతారు. ప్రాక్టికల్స్.. ఎగ్జామ్స్ అంటూ బిజీ అయిపోతారు. ఫ్యామిలీస్ కూడా థియేటర్లకు రావడం తగ్గిపోతుంది. అందుకే ఫిబ్రవరి.. మార్చి నెలల్ని అన్ సీజన్‌గా పరిగణిస్తారు. అలాంటి సమయంలో ఇలాంటి మ్యాడ్ రష్ ఏంటన్నది అర్థం కావడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English