నాగార్జున వర్మను ఎలా వదిలాడబ్బా

నాగార్జున వర్మను ఎలా వదిలాడబ్బా

గత కొన్నేళ్లలో రామ్ గోపాల్ వర్మ ఫామ్ ప్రకారం చూస్తే.. అక్కినేని నాగార్జున అతడితో సినిమా చేయడం ఆశ్చర్యకరమైన విషయమే. తన కెరీర్‌ను మలుపు తిప్పే ‘శివ’ సినిమా ఇచ్చాడని ఏదో మొహమాటానికి పోయి సినిమాలు చేసే రకం కాదు నాగ్. ఓ బలమైన కథతో తన దగ్గరకు రావడంతోనే వర్మకు అవకాశమిచ్చాడు. ఐతే వర్మ సీరియస్‌నెస్ మీద నాగార్జునకు సందేహాలు లేకపోలేదు. ఒకేసారి ఎక్కువ ప్రాజెక్టుల్ని నెత్తికెత్తుకోవడం వల్ల వర్మ డీవియేట్ అయిపోతాడని.. అందుకే ఎందులోనూ పర్ఫెక్షన్ చూపించలేకపోతున్నాడని నాగ్ అభిప్రాయపడుతూ ఈ విషయంపై మీడియా ముఖంగా వర్మకు ఒక రకమైన వార్నింగ్ కూడా ఇచ్చాడు.

తన సినిమాకు సంబంధించిన పని మొదులపెట్టినప్పటి నుంచి వేరే కమిట్మెంట్లేమీ పెట్టుకోనంటేనే సినిమా ఓకే చేస్తానని తాను వర్మకు షరతు పెట్టినట్లు నాగ్ స్వయంగా వెల్లడించాడు. వర్మ కూడా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సహా మిగతా ప్రాజెక్టులన్నీ పక్కన పెట్టి నాగ్ సినిమాకు స్క్రిప్టు పూర్తి చేసుకుని వెళ్లి నాగ్‌ను కలవడంతో ఆ ప్రాజెక్టు పట్టాలెక్కింది. పది రోజుల పాటు ఒక షెడ్యూల్ చేసి.. బ్రేక్ తీసుకుని ‘హలో’ ప్రమోషన్ల పనిలో పడ్డాడు నాగ్. ఐతే నాగ్ ఇలా సైడయ్యాడో లేదో.. వర్మ మళ్లీ తన పాత స్టయిల్లోకి మారిపోయాడు. ‘కడప’ పేరుతో వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ చేశాడు. ఇది చాలా బోల్డ్‌గా ఉండి చర్చనీయాంశంగా మారింది. దీని మీద డిస్కషన్లు మొదలయ్యాయి. ఐతే నాగ్ ప్రాజెక్టు మీద ఉండగా.. మధ్యలో వర్మ ఇలా బయటికి వచ్చి ఈ ట్రైలర్ లాంచ్ చేయడం చూస్తే.. ఇదంతా నాగార్జునకు తెలిసే జరిగిందా.. ఆయన వర్మ ఇలా డీవియేట్ కావడానికి ఎలా అంగీకరించాడు అని సందేహాలు కలుగుతున్నాయి. నాగార్జున ‘హలో’ పనుల్లో బిజీగా ఉండగా.. ఆయనకు తెలియకుండానే వర్మ ఈ ట్రైలర్ లాంచ్ చేశాడని భావిస్తున్నారు. తమ మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ కడపోళ్లు ఎవరైనా గొడవకు దిగితే.. ఆ తర్వాత టీవీ ఛానెళ్ల వాళ్లు చర్చలు పెడితే.. వర్మ వాటిలోకి దిగితే.. ఇక అంతే సంగతులు. వర్మ ఫోకస్ అంతా ఇటు వెళ్లిపోతుంది. ఇది నాగార్జునకు ఎంతమాత్రం రుచించే విషయం కాదు. ఈ నేపథ్యంలో నాగ్ వర్మ విషయంలో ఎలా స్పందిస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు