ముద్దు సీన్ తీయాలంటేనే భయంగా ఉంది

ముద్దు సీన్ తీయాలంటేనే భయంగా ఉంది

ఈ మధ్య ఇండియాలో సినిమాల విషయంలో చాలా గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు సెన్సార్ బోర్డు సినిమాల విషయంలో రకరకాల కొర్రీలు వేస్తుంటే.. మరోవైపు తమ మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ బయట జనాలు కొన్ని సినిమాలకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ‘పద్మావతి’ చుట్టూ ఎంత గొడవ నడుస్తోందో చూస్తున్నాం. సెన్సార్ బోర్డు ఈ సినిమా విషయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీనికి ముందు ‘ఉడ్తా పంజాబ్’.. ‘బాబు మషాయ్ బందూక్‌బాజ్’ లాంటి సినిమాల విషయంలో సెన్సార్ బోర్డు ఎంతగా ఇబ్బంది పెట్టిందో తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళ సీనియర్ నటుడు అరవింద్ స్వామి ప్రస్తుత పరిస్థితులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

ఇండియాలో ఇప్పుడు జనాలు మరీ సున్నితంగా తయారయ్యారని.. సినిమాలపై అన్ని వైపులా దాడి జరుగుతోందని అరవింద్ అన్నాడు. ప్రస్తుతం ఒక ముద్దు సీన్ తీయాలన్నా చాలా భయమేస్తోందని అరవింద్ స్వామి అన్నాడు. వాత్సాయనుడు 2 వేల సంవత్సరాల కిందటే ‘కామసూత్ర’ను రచించాడని.. అది అప్పుడే ఎంతో ప్రాచుర్యం పొందిందని.. కానీ ఇప్పుడు ఒక ముద్దు సీన్ తీయాలన్నా భయపడాల్సి వస్తోందని అరవింద్ స్వామి ఆవేదన వ్యక్తం చేశాడు. ముద్దు సన్నివేశాలు ప్రేమకు సూచిక అని.. అసలు సినిమాల్లో ముద్దు సన్నివేశాలపై ఎందుకు ముందు నుంచి అప్రకటిత నిషేధం విధించారో.. సెన్సార్ బోర్డు కూడా వాటి విషయంలో ఎందుకంత కఠినంగా వ్యవహరిస్తుందో తనకు అర్థం కాదని అరవింద్ అన్నాడు. సినిమా, ఇతర కళా రంగాలకు చెందిన వాళ్లకు బెదిరింపులు ఎక్కువైపోయాయని.. అహింసా మార్గంలో స్వేచ్ఛ పొందిన మన దేశంలో ఇలాంటి పరిస్థితులు రావడం బాధాకరమని అరవింద్ ఆవేదన చెందాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు