నాగార్జున అభిమానుల కలవరం!

నాగార్జున అభిమానుల కలవరం!

'గన్స్‌ అండ్‌ థైస్‌' అంటూ ముంబయి మాఫియా నేపథ్యంలో వెబ్‌ సిరీస్‌ చేస్తానంటూ ఒక ట్రెయిలర్‌ కూడా వదిలాడు రాంగోపాల్‌వర్మ. అది ఏమైందనేది ఇంతవరకు ఎవరికీ తెలియదు. ఇంతవరకు కనీసం ఒక ఎపిసోడ్‌ కూడా వదల్లేదు. ఇంతలోనే రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో 'కడప' అంటూ ఇంకో వెబ్‌సిరీస్‌ తాలూకు ట్రెయిలర్‌ రిలీజ్‌ చేసాడు. 'గన్స్‌ అండ్‌ థైస్‌'లానే ఇది కూడా మితి మీరిన హింసోన్మాదంతో పాటు బూతులతో నిండిపోయింది. కంటెంట్‌ కంటే కూడా సెన్సేషన్‌ అనిపించే స్టఫ్‌తో నింపేసి క్యాష్‌ చేసుకోవడం వర్మ స్టయిల్‌.

గన్స్‌ అండ్‌ థైస్‌ ట్రెయిలర్‌కే ఆరు మిలియన్లకి పైగా వ్యూస్‌ వచ్చాయి. కడప ట్రెయిలర్‌ కూడా మిలియన్‌ వ్యూస్‌ దిశగా సాగుతోంది. ఎలాంటివి పెడితే తను తీసే వాటి గురించి జనం మాట్లాడుకుంటారనేది వర్మ కనిపెట్టాడు. యూట్యూబ్‌ కంటెంట్‌కి సెన్సార్‌ లేదు కనుక దానిని కూడా తనకి అనుకూలంగా వాడేసుకుంటున్నాడు. అయితే ఇదంతా వర్మ నిజంగా సంచలనాత్మక వెబ్‌ సిరీస్‌లు తీయాలనే చిత్తశుద్ధితో చేస్తున్నాడా లేక ఈజీగా వ్యూస్‌ రాబట్టే ఎత్తు వేసాడా అనేది అర్థం కావడం లేదు.

ఒకవైపు సినిమాలు తీస్తూనే వున్న వర్మకి ఇలాంటివి చేసే సమయం ఎక్కడ దొరుకుతోందో? ఇదిలావుంటే ఇలాంటివి చూస్తోన్న నాగార్జున అభిమానులు కలవరపడుతున్నారు. ఈ స్థాయి ఆలోచనా శైలితో వర్మ తీసే నాగార్జున సినిమా ఎలా తయారవుతుందా అనే కంగారు 'కడప' ట్రెయిలర్‌ తర్వాత మరింత పెరిగింది. తనతో సినిమా తలపెట్టిన వర్మ చేస్తోన్న ఈ హల్‌చల్‌ చూస్తూ నాగ్‌ స్పందన ఎలాగుందో మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు