అమేజాన్‌ డేంజర్ అంటున్న బాబు

అమేజాన్‌ డేంజర్ అంటున్న బాబు

ఒకప్పుడు థియేటర్లలో రిలీజైన సినిమా టీవీల్లోకి రావాలంటే ఏళ్లకు ఏళ్లు పట్టేది. మూణ్నాలుగేళ్ల ముందు రిలీజైన సినిమా టీవీలో ప్రసారమైనా.. దాన్ని కొత్త సినిమా అనే వాళ్లం. కానీ ఇప్పుడు మూడు నెలల ముందు రిలీజైన సినిమా కూడా టీవీలో చూసేస్తున్నాం. కొన్ని సినిమాలైతే రిలీజైన నెల రోజులకే టీవీల్లో పడిపోతున్నాయి. అమేజాన్.. నెట్ ఫ్లిక్స్ లాంటి డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ వచ్చాక ఈ గ్యాప్ మరీ తగ్గిపోయింది. నిర్మాతలకు ఇది లాభదాయకమైన ఆదాయంగా మారడంతో రిలీజ్ కంటే ముందే డీల్స్ చేసుకుంటున్నారు. డిజిటల్ ఫ్లాట్ ఫాంలో ఎంత త్వరగా సినిమాను రిలీజ్ చేసినా పట్టించుకోవట్లేదు. ఈ ఏడాది సెన్సేషనల్ హిట్టయిన ‘అర్జున్ రెడ్డి’ థియేటర్లలో రిలీజైన 50 రోజులకే అమేజాన్‌లో రిలీజైంది.

ఐతే ఇలా థియేటర్లలో రిలీజైన నెలా నెలన్నరకే సినిమాను టీవీల్లో.. ఇంటర్నెట్లో రిలీజ్ చేయడం చాలా ప్రమాదకరం అంటున్నారు అగ్ర నిర్మాత సురేష్ బాబు. నిర్మాతలు అత్యాశకు పోయి దీని వల్ల జరిగే నష్టాన్ని పట్టించుకోవట్లేదని ఆయన అన్నారు. నెల రోజులకే సినిమా ఇంటర్నెట్లో అధికారికంగా.. లేదా టీవీల్లో చూసుకునే అవకాశం ఉన్నపుడు జనాలు థియేటర్లకు ఎందుకొస్తారని ఆయన ప్రశ్నించారు.

అమేజాన్‌లోకి వచ్చాక చూసుకుందాంలే.. టీవీలో చూద్దాంలే అనుకుని ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేస్తారని.. రోజు రోజుకూ థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గిపోతుండటానికి ఇదే కారణమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని రోజులు పోయాక నేరుగా సినిమాను శాటిలైట్‌లో రిలీజ్ చేసే పరిస్థితి వస్తుందేమో అని ఆయన అన్నారు. నిర్మాతలు ఎవరికి వారు తమ సినిమాను అమ్మేసుకున్నాం.. సేఫ్ అయిపోయాం అనుకోకుండా.. ఈ విషయంలో కలిసి కట్టుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు