ఈ బంతుల గోలేంటి రాజు గారూ..

ఈ బంతుల గోలేంటి రాజు గారూ..

ఓవర్లో ఆరు బంతులంట.. ఆరు బంతులకూ ఆరు సిక్సర్లంట.. దిల్ రాజు ఈ మధ్య తన ప్రతి సినిమా వేడుకల్లో ఇదే థియరీ చెప్పి ఊదరగొట్టేస్తున్నారు. ‘ఫిదా’ ఆడియో వేడుకలో తొలిసారిగా ఈ థియరీ చెప్పినప్పుడు బాగానే అనిపించింది. ఏదో కొత్తగా ఉందన్న భావన కలిగింది. ఐతే మళ్లీ ‘రాజా ది గ్రేట్’ వేడుకలోనూ ఇదే థియరీ చెప్పాడు రాజు.

మళ్లీ ఇప్పుడు ‘ఎంసీఏ’ దగ్గరికొచ్చేసరికి అది రికార్డు మళ్లీ మళ్లీ వినిపిస్తున్నాడు. దిల్ రాజు ఈ థియరీ వినిపించినపుడల్లా ‘దువ్వాడ జగన్నాథం’ బౌండరీకి వెళ్లకుండానే ఆగిపోయింది కదా.. అనే డౌట్ జనాలకు కొడుతూనే ఉంది. ‘రాజా ది గ్రేట్’ కూడా ఎంత కష్టపడ్డా బౌండరీ లైన్ దాటలేకపోయింది.

తనకు ‘జవాన్’ రూపంలో అదనపు ఎక్స్‌ట్రా బాల్ ఒకటి దొరికిందంటూ ఆ సినిమా వేడుకలోనూ బంతుల థియరీని వదల్లేదు రాజు గారు. ఆ ఎక్స్‌ట్రా బంతి ఆయన్ని బౌల్డ్ చేసేసిందన్న విషయం అందరికీ తెలుసు. ఇక చివరి బంతిగా చెబుతున్న ‘ఎంసీఏ’ మీద అంత భరోసా ఏమీ కనిపించడం లేదు. ఈ సినిమాకు ఆశించినంత బజ్ రాలేదు.  నాని మ్యాజిక్ వర్కవుటైతే సినిమా ఆడుతుంది. లేదంటే అంతే సంగతులు. ఇది సిక్సర్ అవుతుందన్న అంచనాలైతే లేవు. ఏదేమైనా దిల్ రాజు పదే పదే ఈ బంతుల థియరీ గురించి జనాలకు మొహం మొత్తేలా చేయడమే కాదు.. తన మీద తాను అనవసర ఒత్తిడి పెంచుకుంటున్నారన్నది మాత్రం వాస్తవం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు