చైతూ కోసం ‘యుద్ధం’ చేసి.. పవన్ కోసం ఇలా

చైతూ కోసం ‘యుద్ధం’ చేసి.. పవన్ కోసం ఇలా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల్ని రెండు రోజుల నుంచి ఒక వీడియో ఉర్రూతలూగిస్తోంది. ‘అజ్నాతవాసి’తో తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న తమిళ యువ సంగీత సంచలనం అనిరుధ్.. ఈ సినిమా నుంచి లాంచ్ అయిన కొత్త పాట ‘గాలి వాలుగా’తో పవన్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. ప్రమోషనల్ సాంగ్ అంటే ఏదో సింపుల్‌గా ఉంటుందని అనుకున్నారు కానీ.. అనిరుధ్ ఇంత శ్రద్ధ పెట్టి.. ఇంత గ్రాండ్‌గా వీడియో రూపొందిస్తాడని.. పవన్ మీద తన అభిమానాన్ని ఈ స్థాయిలో చాటుకుంటాడని ఎవ్వరూ అనుకోలేదు. ఆ వీడియో టాప్ క్లాస్ అన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది.

ఈ వీడియో సాంగ్‌‌కు సంబంధించి ఒక ఆసక్తికర విశేషం బయటికి వచ్చింది. దీన్ని డైరెక్ట్ చేసింది ఒక ఫీచర్ ఫిలిం డైరెక్టర్ కావడం విశేషం. అతనెవరో కాదు.. అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ‘యుద్ధం శరణం’ రూపొందించిన కృష్ణ మారిముత్తు. ఈ సినిమాతోనే మూడు నెలల కిందట దర్శకుడిగా పరిచయమయ్యాడు కృష్ణ. చైతూకు స్కూల్ ఫ్రెండ్ అయిన కృష్ణకు ఆ సినిమా చేదు అనుభవాన్ని మిగిల్చింది. అతడికి దర్శకుడిగా తెలుగులో ఇంకో అవకాశం దక్కడం కష్టంగా ఉంది. ఇలాంటి తరుణంలో అతను ఈ ప్రమోషనల్ సాంగ్‌ను డైరెక్ట్ చేశాడు. ఏమాటకామాటే చెప్పుకోవాలి కానీ.. పాప్ సాంగ్స్ తరహాలో ఈ పాటను బాగానే తీశాడు కృష్ణ. మరి ఈ వీడియో సాంగ్ చూసి కృష్ణకు ఇంకెవరైనా దర్శకుడిగా ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English