సంక్రాంతి సినిమాలపై ఉత్కంఠ

 సంక్రాంతి సినిమాలపై ఉత్కంఠ

తెలుగులో అత్యధికంగా పెద్ద సినిమాలు రిలీజయ్యే వీకెండ్ అంటే సంక్రాంతి సీజన్లోనే. ఒకే వారాంతంలో మూడు నాలుగు పెద్ద సినిమాలు రేసులో నిలుస్తుంటాయి. ఈ సీజన్లో. గత ఏడాది నాలుగు.. ఈ ఏడాది మూడు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. వాటిలో అన్నింటికీ మంచి వసూళ్లే వచ్చాయి.

ఐతే వచ్చే సంక్రాంతికి మాత్రం తెలుగు రెండంటే రెండు సినిమాలే కన్ఫమ్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ సినిమా ‘అజ్నాతవాసి’ జనవరి 10న థియేటర్లలోకి దిగుతుండగా.. బాలయ్య మూవీ ‘జై సింహా’ 12న రిలీజవుతుంది. వచ్చే సంక్రాంతికి ఇంకా ఏవేవో సినిమాలు వస్తాయంటూ ప్రచారం జరిగింది కానీ.. అదేం నిజం కాలేదు.

ఐతే సంక్రాంతి సీజన్‌ను రెండు సినిమాలతో వదిలేస్తారా అంటే సందేహమే. వీలు చూసుకుని ఇంకా ఒకటో రెండో సినిమాలు రావడం ఖాయం అంటున్నారు. కానీ ఆ సినిమాలు ఏవనేది తెలియడం లేదు. రవితేజ సినిమా ‘టచ్ చేసి చూడు’ ఇంకా షూటింగ్ కూడా పూర్తి చేసుకోని నేపథ్యంలో అది రావడం డౌటే. రాజ్ తరుణ్ సినిమా ‘రాజు గాడు’ కూడా వెనక్కి తగ్గినట్లే ఉంది. ఐతే జనవరి 26కు విడుదల తేదీ ఖరారు చేసుకున్న అనుష్క సినిమా ‘భాగమతి’ ముందుకు రావచ్చని అంటున్నారు. ఖాళీగా ఉంది కదా అని 26కు బెర్తు బుక్ చేసుకుంటే.. అదే తేదీకి ఇంకో నాలుగు సినిమాలు పోటీకి వచ్చాయి. దీని కన్నా సంక్రాంతి సీజనే మేలని యువి క్రియేషన్స్ వాళ్లు భావిస్తున్నారట.

మరోవైపు నాగార్జున నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘రంగుల రాట్నం’ను కూడా సంక్రాంతికి సడెన్‌గా రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నారట. వేరే సినిమాలు లేని పక్షంలో ఇది కచ్చితంగా సంక్రాంతికి వచ్చేస్తుందట. మరోవైపు సూర్య డబ్బింగ్ సినిమా ‘గ్యాంగ్’ను కూడా సంక్రాంతికే తేవాలనుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు