సప్తగిరి మ్యాజిక్ ఈసారి పని చేయలేదు

సప్తగిరి మ్యాజిక్ ఈసారి పని చేయలేదు

కమెడియన్ సప్తగిరి హీరోగా నటించిన తొలి సినిమా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ ఏమంత మంచి రివ్యూలు రాలేదు. అయినప్పటికీ ఆ సినిమాకు వసూళ్లు పర్వాలేదనిపించాయి. తక్కువ బడ్జెట్లో సినిమా పూర్తి చేయడం.. పవన్ కళ్యాణ్ ఆడియో వేడుకకు అతిథిగా రావడం వల్ల కొంచెం హైప్ వచ్చి ఓపెనింగ్స్ రావడంతో నిర్మాత సేఫ్ అయిపోయాడు.

ఈ ఉత్సాహంలో సప్తగిరిని హీరోగా పెట్టి అదే నిర్మాత ‘సప్తగిరి ఎల్ఎల్‌బీ’ సినిమా తీశాడు. ఈసారి కొంచెం ఎక్కువే ఖర్చు చేశాడు. బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఐదు కోట్లకు పైనే థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. కానీ సినిమాకు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. వీకెండ్లోనే వసూళ్లు అంతంతమాత్రంగా వచ్చాయి.

వీకెండ్ తర్వాత అయితే ‘సప్తగిరి ఎల్ఎల్బీ’కి మరీ నామమాత్రపు వసూళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పుంజుకునే అవకాశాలు ఎంతమాత్రం కనిపించలేదు. ఎ-సెంటర్లలో ఈ సినిమా తేలిపోయింది. దీనికి పోటీగా వచ్చిన ‘మళ్ళీరావా’ సిటీల్లో బాగా ఆడుతోంది. ‘సప్తగిరి ఎల్ఎల్బీ’ బి-సి సెంటర్లలో కొంతమేర పర్వాలేదనిపించింది. ఐతే ఆ వసూళ్లు బయ్యర్లను బయట పడేసేలా ఏమీ లేవు.

బాలీవుడ్ నుంచి ‘జాలీ ఎల్ఎల్‌బీ’ లాంటి మంచి కథను తీసుకొచ్చి కిచిడీ చేసేసింది సప్తగిరి టీం. అది దారుణంగా బెడిసికొట్టింది. ఈ సినిమా ఫలితం హీరోగా సప్తగిరి కెరీర్‌కు పెద్ద ప్రతికూలతగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. హీరోగా సప్తగిరి తొలి సినిమాకు వసూళ్లు రావడానికి అసలు కారణాలేంటో ఆలోచించకుండా.. ఈసారి నేలవిడిచి సాము చేసినందుకు ‘సప్తగిరి ఎల్ఎల్బీ’ టీం గట్టి ఎదురు దెబ్బే తిన్నట్లుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English