నిర్మాతలకి చుక్కలు చూపిస్తున్న రవితేజ

నిర్మాతలకి చుక్కలు చూపిస్తున్న రవితేజ

బెంగాల్‌ టైగర్‌ తర్వాత దాదాపు రెండేళ్లు గ్యాప్‌ రావడానికి కారణం రవితేజ డిమాండ్లేనని చెప్పుకున్నారు. సినిమాకి పది కోట్లు డిమాండ్‌ చేయడం వల్ల నిర్మాతలు ముందుకు రాలేదని, వచ్చిన వాళ్లంతా డ్రాప్‌ అయిపోయారని వార్తలొచ్చాయి. తర్వాత దిల్‌ రాజుతో తక్కువ పారితోషికానికి ఒప్పందం చేసుకుని రాజా ది గ్రేట్‌ చిత్రం చేసాడు. అది ఒక మాదిరిగా ఆడేసరికి రవితేజ తనే గ్రేట్‌ అన్నట్టు ప్రవర్తిస్తున్నాడట.

మళ్లీ పది కోట్ల పారితోషికం అడుగుతూ నిర్మాతలని భయపెడుతున్నాడట. రాజా ది గ్రేట్‌ చిత్రాన్ని ముప్పయ్‌ కోట్ల రేంజ్‌లో అమ్మితే పూర్తిగా రికవర్‌ అవలేదు. చాలా ఏరియాల్లో బయ్యర్లు కాస్తో కూస్తో నష్టపోయారు. ఈ నేపథ్యంలో రవితేజకి పది కోట్లు ఇస్తే ఇక సినిమా ఎంతలో తీయాలి, ఎంతకి అమ్మాలి అంటూ నిర్మాతలు కంగారు పడుతున్నారు.

అయితే వయసు ముదిరిపోతోంది కనుక, ఇక ఎక్కువ సినిమాలు చేసే వీలు లేదు కనుక ఇప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని రవితేజ చూస్తున్నాడట. ఇదే కారణం మీద రెండేళ్ల పాటు ఖాళీ అయిపోయి చాలా నష్టపోయిన రవితేజ అలా ఖాళీగా వుండే కంటే ఆరేడు కోట్ల పారితోషికం తీసుకుని ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేసుకుంటే ఉత్తమం కదా అని సినీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

అయితే ఇప్పుడు ఎలాంటి సినిమా పడితే అది ఆడడం లేదు కనుక ఆచి తూచి సినిమాలు చేయాలని, ఏడాదికి ఒకటి చేసినా కానీ దానినుంచి సాంతం పిండుకోవాలని రవితేజ ఆలోచిస్తున్నాడట. మరి ఈ ఆలోచనతో మాస్‌ మహారాజాపై అంత పెట్టుబడి పెట్టేదెవరనేది చూడాలిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు