ఫ్లాప్ హీరో మళ్లీ వస్తున్నాడు..

ఫ్లాప్ హీరో మళ్లీ వస్తున్నాడు..

‘ప్రస్థానం’ సినిమాతో మంచి నటుడిగా పేరు తెచ్చుకుని.. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో హీరోగానూ నిలదొక్కుకున్నాడు సందీప్ కిషన్. ఆ సినిమా అతడికి టాలీవుడ్లో చాలా అవకాశాలే తెచ్చిపెట్టింది. కానీ దాని తర్వాత అతను నటించిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో ఫలితాన్నివ్వలేదు. అందులోనూ గత రెండు మూడేళ్లలో సందీప్ నటించిన సినిమాలైతే అతడికి చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఇటీవలే ‘కేరాఫ్ సూర్య’తో మరో ఎదురు దెబ్బ తిన్నాడు సందీప్. ఐతే ఈ సినిమా వచ్చిన నెల రోజుల్లోనే సందీప్ మళ్లీ ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. అతను హీరోగా నించిన ‘ప్రాజెక్ట్ జడ్’ అనే సినిమా డిసెంబరు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

తమిళంలో ‘మాయవన్’ పేరుతో తెరకెక్కిన సినిమా ఇది. నిజానికి ఈ చిత్రం ఈ ఏడాది ప్రథమార్ధంలోనే రావాల్సింది. ఫైనాన్స్ ఇష్యూల వల్ల ఆలస్యమైంది. ఇటీవలే అశోక్ అనే నిర్మాత మరణానికి కారణమైనట్లుగా ఆరోపణలెదుర్కొంటున్న అన్బు చెళియన్ ఈ చిత్ర దర్శక నిర్మాత సి.వి.కుమార్‌ను కూడా ఇబ్బంది పెట్టాడట. అందుకే సినిమా ఆలస్యమైందట. ఎట్టకేలకు దీనికి మోక్షం కలిగి విడుదలకు సిద్దమైంది. నిర్మాతగా మంచి అభిరుచితో సినిమాలు చేసిన సి.వి.కుమార్ తొలిసారి దర్శకుడిగా చేసిన సినిమా ఇది. ఇందులో సందీప్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ప్రజాల్ని.. పోలీసుల్ని ముప్పు తిప్పలు పెట్టే ఒక సైకో కిల్లర్‌ను పట్టుకునే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించడం విశేషం. ఈ థ్రిల్లర్ మూవీ అయినా సందీప్‌కు ఆశించిన ఫలితాన్నిస్తుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు