షాకింగ్: పోస్టర్ మీద పైరసీ రిలీజ్ డేట్

షాకింగ్: పోస్టర్ మీద పైరసీ రిలీజ్ డేట్

అల్లరి నరేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘సుడిగాడు’ సినిమా ఓ తమిళ సినిమాకు రీమేక్. ఆ సినిమా పేరు.. తమిళ్ పడం. అంటే తమిళ సినిమా అని అర్థం. అప్పట్లో ఈ సినిమా తమిళంలో సెన్సేషనల్ హిట్టయింది. ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోల మీద సెటైర్లు వేశారు ఈ చిత్రంలో. ఇప్పుడీ సినిమాకు తమిళంలో సీక్వెల్ తయారవుతోంది. ‘తమిళ్ పడం 2.0’ అని టైటిల్ పెట్టారు. ‘తమిళ్ పడం’లో నటించిన శివనే ఇందులోనూ హీరో. మాధవన్, విజయ్ సేతుపతి, సిద్దార్థ్ లాంటి వాళ్లు క్యామియో రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ లోగో పోస్టర్ తాజాగా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది.

ఈ పోస్టర్ మీద ముందుగా దీని రిలీజ్ డేట్ ఇచ్చారు. 2018 మే 25న ‘తమిళ్ పడం 2.0’ రిలీజవుతుందని ప్రకటించారు. దాని కిందే ఈ చిత్రం మరుసటి రోజు ‘తమిళ్ రాకర్స్’ వెబ్ సైట్లో రిలీజవుతుందని పేర్కొనడం విశేషం. తమిళ్ రాకర్స్ అనేది తమిళంలో పేరుమోసిన పైరసీ వెబ్ సైట్. ఏ కొత్త సినిమా రిలీజైనా ఆ రోజు రాత్రికే ఆ వెబ్ సైట్లో వచ్చేస్తుంది. ఫలానా సమయానికి సినిమా వెబ్ సైట్లో అప్ లోడ్ అవుతుందని ట్విట్టర్లో అధికారికంగా ప్రకటించి మరీ ఈ వెబ్ సైట్ పైరసీ ప్రింట్లు పెడుతుంటుంది. తమిళ ఇండస్ట్రీ జనాలు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఈ వెబ్ సైట్‌ను ఏమీ చేయలేకపోయారు. నిర్మాతల మండలి అధ్యక్షుడయ్యాక విశాల్ కూడా సవాళ్లు విసిరాడు కానీ.. ఆ వెబ్ సైట్ ఇప్పటికీ దివ్యంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ‘తమిళ్ పడం 2.0’ చిత్ర బృందం.. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తూ ఈ ప్రకటన చేసినట్లుంది. దీని మీద సెలబ్రెటీలు, సామాన్యులు సామాజిక మాధ్యమాల్లో కామెడీ చేస్తూనే తమిళ సినిమాల దుస్థితి గురించి చర్చించుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు