'2.0' లేటు.. అసలు కారణం ఇదీ

'2.0' లేటు.. అసలు కారణం ఇదీ

ఈ ఏడాది దీపావళికే విడుదల కావాల్సిన సినిమా ‘2.0’. అక్కడి నుంచి జనవరి 26కు వాయిదా పడింది. ఆ డేట్ పక్కా అనుకుంటున్న సమయంలో మళ్లీ వాయిదా అంటూ వార్తలొచ్చాయి. ఈ మధ్యే చిత్ర నిర్మాతలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ సినిమా విడుదల తేదీని అనుసరించి.. మిగతా చిత్రాల రిలీజ్ డేట్లు కూడా ఆధారపడి ఉండటంతో ఇలా మళ్లీ మళ్లీ డేట్ మార్చడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు నిర్మాతలైతే ‘2.0’ మేకర్స్ మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఏప్రిల్లో ‘2.0’ విడుదలకు చెక్ పెట్టేలా తీర్మానాలు కూడా చేస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ నిర్మాతల నుంచి కూడా ఇలాంటి వ్యతిరేకతే వ్యక్తమవుతోంది.

ఐతే ‘2.0’ ఇలా రెండుసార్లు వాయిదా పడటానికి అసలు కారణం ఏంటన్నది ఇప్పుడు వెల్లడైంది. ‘లైఫ్ ఆఫ్ పై’ లాంటి భారీ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ సమకూర్చిన రిథమ్ అండ్ హ్యూస్ స్టూడియోస్ అనే హాలీవుడ్ సంస్థ ‘2.0’ మేకర్స్‌కు హ్యాండివ్వడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందట. ఈ సంస్థ చెప్పిన సమయానికి వీఎఫెక్స్ షాట్లు చేసి ఇవ్వలేదట. అందువల్లే ఒకటికి రెండుసార్లు సినిమాను వాయిదా వేయాల్సి వచ్చిందట.

90 శాతం పేమెంట్ తీసుకుని.. చెప్పిన సమయానికి ఔట్ పుట్ డెలివర్ చేయకపోవడంతో ‘2.0’ నిర్మాతలు ఆ సంస్థపై ఆగ్రహంగా ఉన్నారు. తమకు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి రావడానికి కారణమైన ఆ సంస్థపై లీగల్ యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఆ సంస్థపై చీటింగ్ కేసు పెట్టనున్నట్లు సమాచారం. ఈ కేసు సంగతి సరే కానీ.. కనీసం ఏప్రిల్లో అయినా ‘2.0’ వస్తుందా లేక మళ్లీ వాయిదా అంటారా అన్నదే సందేహం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు