బన్నీ మీద అభిమానుల్ని ఉసిగొల్పేసినట్లే

బన్నీ మీద అభిమానుల్ని ఉసిగొల్పేసినట్లే

అసలే పవన్ కళ్యాణ్ అభిమానులకు అల్లు అర్జున్ మీద పీకల దాకా కోపం ఉంది. గత ఏడాది ‘సరైనోడు’ ఆడియో వేడుకలో పవన్ కళ్యాణ్ గురించి ‘చెప్పను బ్రదర్’ అనే కామెంట్ చేసినప్పటి నుంచి అతడి మీద పవర్ స్టార్ అభిమానులు గుర్రుగా ఉన్నారు.

ఆ తర్వాత కొన్ని కారణాలతో ఈ ఆగ్రహం మరింత పెరిగింది. మధ్యలో బన్నీ తిరిగి పవన్ అభిమానులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అంతరం మరింత పెరిగింది తప్ప తగ్గలేదు. ఈ నేపథ్యంలో తాజాగా రాజమండ్రి పర్యటన సందర్భంగా పవన్.. అల్లు అరవింద్‌ను ఉద్దేశించిన చేసిన కామెంట్లతో పవన్ ఫ్యాన్స్-బన్నీ మధ్య దూరం మరింత ఎక్కువయ్యేలా కనిపిస్తోంది.

2009 ఎన్నికల సందర్భంగా ప్రజారాజ్యం పార్టీ యువత విభాగాన్ని తాను చూస్తున్నపుడు అల్లు అరవింద్ తనను తక్కువగా చూడటం పట్ల ఎన్నో ఏళ్లుగా దాచుకున్న అసంతృప్తిని.. అసహనాన్ని నిన్న చూపించేశాడు పవన్. తనను అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి వాళ్లతో సమానంగా అల్లు అరవింద్ చూశాడని.. ఎక్కడికైనా వెళ్లాలంటే తన బదులు బన్నీని లేదా చరణ్‌ను పంపొచ్చని అన్నాడని.. తనను కేవలం ఒక నటుడిగా మాత్రమే చూశాడని.. తనలోని సామాజిక స్పృహను ఆయన గుర్తించలేదని అసంతృప్తి వ్యక్తం చేశాడు పవన్.

ఒకప్పుడు అరవింద్‌తో ఎంతో సన్నిహితంగా ఉన్న పవన్ గత కొన్నేళ్లుగా ఆయనకు ఎందుకంత దూరంగా ఉంటున్నాడన్నది ఇప్పుడు స్పష్టమైపోయింది. ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి అరవింద్ మీద పవన్‌లో చాలా అసంతృప్తి ఉన్నట్లే కనిపిస్తోంది. స్వయంగా పవనే అరవింద్ మీద ఇలా తన అసంతృప్తిని ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే బన్నీ విషయంలో ప్రతికూలంగా ఉన్న పవన్ ఫ్యాన్స్.. వ్యతిరేకతను మరింత పెంచుకునే ప్రమాదం లేకపోలేదు. ఒక రకంగా నిన్నటి వ్యాఖ్యలతో పవన్ తన అభిమానుల్ని ఉసిగొల్పినట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు