అక్కినేని నాగేశ్వరరావుకు అడ్డంగా దొరికిపోయిన జగన్

అక్కినేని నాగేశ్వరరావుకు అడ్డంగా  దొరికిపోయిన జగన్

జగనేంటి... అక్కినేని నాగేశ్వరరావుకు అడ్డంగా దొరికిపోవడమేంటి.. ఇంతకీ ఆయన చేసిన తప్పేంటి అనుకుంటున్నారా...? అయితే, అక్కినేని మనవడు, హీరో సుమంత్ చెప్పే ఫ్లాష్ బ్యాక్ చదివి తీరాల్సిందే.

సుమంత్, జగన్ ఇద్దరూ క్లాస్ మేట్స్. ఇద్దరి మధ్య మాంచి దోస్తీ ఉండేదట. అక్కినేని వారి ఇంట్లో సుమంత్‌ది మేడ మీద గది... ఒక రోజు రాత్రి సుమంత్, జగన్ ఇద్దరూ బయట డిన్నర్ చేయడానికి వెళ్లి ఆలస్యంగా వచ్చారట. రాత్రి 12 అయిపోయింది.. సుమంత్ తాళాలు మర్చిపోయాడు.. సో గదిలోకి వెళ్లాలంటే ఇంట్లోవాళ్లను లేపాలి, లేదంటే బాల్కనీలోకి వెళ్లి అక్కడి నుంచి గదిలోకి వెళ్లాలి. ఇంట్లో వాళ్లను నిద్రలేపితే.. తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు నిద్రలేచి క్లాసు పీకుతారని సుమంత్ భయం. దాంతో బాల్కనీలోకి ఎక్కి అక్కడి నుంచి గదిలోకి వెళ్దామని సుమంత్ ప్లాన్ చేశాడు. దాంతో బాల్కనీలోకి ఎక్కడానికి సుమంత్ ప్రయత్నిస్తుంటే కింద నుంచి జగన్ ఆయనకు హెల్ప్ చేస్తున్నాడట... ఈ హడావుడంతా జరుగుతూ సుమంత్ అలా బాల్కనీకి వేలాడుతున్న సమయంలో అక్కినేని నిద్రలేచి బయటకొచ్చేశారు.. ఆయన్ను చూడగానే సుమంత్ కు గొంతు తడారిపోయిందట. ఏం చెప్పాలో తెలియక... జగన్ ను చూపిస్తూ.. ‘‘తాతా.. జగన్.. రాజశేఖరరెడ్డిగారి అబ్బాయి’’  అని చెప్పాడట. అందుకు అక్కినేని... "నైస్ టూ మీట్ యూ" అని అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్లిపోయారట.

ఓ వెబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమంత్ తాజాగా ఇదంతా గుర్తు చేసుకున్నాడు. అదంతా చదువుకునే రోజుల్లో జరిగిందని... తాను తాళాలు మరచిపోయినందునే అలా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఆనాటి రోజులు మళ్లీ రావన్నాడు. ఇద్దరం మంచి స్నేహితులమని.. బిజీ జీవితాల కారణంగా తరచూ కలుసుకోలేకపోతున్నామని అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు