సప్తగిరి పర్సనల్ డ్యాన్స్‌మాస్టర్‌ని పెట్టుకుని..

సప్తగిరి పర్సనల్ డ్యాన్స్‌మాస్టర్‌ని పెట్టుకుని..

కమెడియన్ టర్న్డ్ హీరోలు.. తాము కథానాయకులుగా నటించే సినిమాల్లో కేవలం కామెడీ మాత్రమే చేయట్లేదు. వీర లెవెల్లో డ్యాన్సులేస్తున్నారు, ఫైట్లూ చేస్తున్నారు. ఈ విషయంలో సునీల్ ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కు వెళ్లిపోవడం చూశాం. ఇప్పుడు సప్తగిరి సైతం సునీల్ బాటలోనే నడుస్తున్నట్లున్నాడు.

అతను హీరోగా నటించిన తొలి సినిమా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’లో డ్యాన్సులు, ఫైట్లు బాగానే చేశాడు సప్తగిరి. ఐతే ఇలాంటివి అతడికి అవసరమా అన్న డిస్కషన్ కూడా నడిచింది అప్పట్లో. ఇప్పుడు తాను హీరోగా నటించిన కొత్త సినిమా ‘సప్తగిరి ఎల్ఎల్బీ’లో కూడా అతనేమీ తగ్గినట్లు లేడు. టీజర్, ట్రైలర్ చూస్తే డ్యాన్సులు, ఫైట్లు గట్టిగానే చేసినట్లు కనిపిస్తున్నాడు. ముఖ్యంగా సప్తగిరి డ్యాన్సుల గురించే ముందే పెద్ద చర్చ జరిగింది. వి.వి.వినాయక్, సుకుమార్ లాంటి పెద్ద దర్శకులు కూడా సప్తగిరి డ్యాన్సుల విషయమై ప్రశంసలు కురిపించారు.

దీనిపై సప్తగిరి స్పందించాడు. డ్యాన్సుల విషయంలో తాను ఎంత కష్టపడిందీ వివరించాడు. ‘‘నాకు డ్యాన్సులు వేయాలనే కసి ఉంది. మ్యూజిక్ వినగానే నాలో ఒక ఊపు వచ్చేస్తుంది. దాన్ని ఒక ఆర్డర్లో పెట్టుకుంటే మంచి ఔట్ పుట్ వస్తుందనిపించింది. అందుకే పర్సనల్‌గా ఒక డ్యాన్స్ మాస్టర్ని పెట్టుకుని కష్టపడ్డాను. నేను డ్యాన్సులు ఎలా చేశానో సినిమా చూసి జనాలు చెప్పాలి’’ అని సప్తగిరి అన్నాడు.

క్రియేటివ్ సైడ్ కూడా ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బీ’లో తన పాత్ర ఉందని అతను చెప్పాడు. ‘‘నటుడు కాకముందు నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఏడేళ్లు కష్టపడ్డాను. దీంతో నాకంటూ కొన్ని ఆలోచనలు ఏర్పడ్డాయి. అనుకోకుండా కమెడియన్ అయ్యాను. ఇప్పుడు హీరో కూడా అలాగే అయ్యాను. నా ఆలోచనల్ని ప్రెజెంట్ చేస్తూ నిజాయితీతో సినిమాలు చేస్తున్నాను’’ అని సప్తగిరి తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు