మణిరత్నంతో చేస్తున్నా.. ఆపండి చూద్దాం

మణిరత్నంతో చేస్తున్నా.. ఆపండి చూద్దాం

గత వారం రోజులుగా కోలీవుడ్లో స్టార్ హీరో శింబు గురించి పెద్ద చర్చే నడుస్తోంది. శింబుతో సినిమా తీసి తాను దారుణంగా నష్టపోయానని.. అతను ‘ఏఏఏ’ సినిమా షూటింగుకి అసలేమాత్రం సహకరించలేదని.. అతడి నుంచి తనకు పరిహారం ఇప్పించాలని మైకేల్ రాయప్పన్ అనే నిర్మాత ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ చిత్ర దర్శకుడు కూడా నిర్మాతకు మద్దతుగా నిలవడంతో శింబుదే తప్పు అని కోలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో శింబుకు నిర్మాతల మండలి రెడ్ కార్డు ఇస్తుందని.. అతను కొంత కాలం పాటు ఏ సినిమాలో నటించకుండా సస్పెన్షన్ పడుతుందని అంటున్నారు. దీంతో మణిరత్నం సినిమా నుంచి శింబును తప్పించి.. వేరే నటుడిని ఎంచుకుంటారని కూడా వార్తలు వచ్చాయి. ఈ వివాదం విషయంలో శింబు ప్రతినిధులు మాట్లాడారు కానీ.. శింబు మాత్రం మౌనంగా ఉంటున్నాడు. ఐతే ఎట్టకేలకు శింబు ఈ గొడవపై స్పందించాడు.

ఓ తమిళ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ.. తనకు వ్యతిరేకంగా కోలీవుడ్లో కుట్ర జరుగుతోందని అతను ఆరోపించాడు. తాను మణిరత్నం సినిమాలో నటించడం ఖాయమని.. త్వరలోనే షూటింగ్ కూడా ఆరంభం కాబోతోందని.. దీన్ని ఎవరైనా ఎలా అడ్డుకుంటారో చూస్తానని శింబు అన్నాడు. తాను దీంతో సహా మూడో సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చానని.. ఈ మూడూ సినిమాలూ కొత్త ఏడాదిలో పూర్తి చేసి తీరుతానని.. తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్న వాళ్లను ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసని అతనన్నాడు.