మురుగదాస్.. హాలీవుడ్ రీమేక్?

మురుగదాస్.. హాలీవుడ్ రీమేక్?

సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్‌కు ‘స్పైడర్’ రూపంలో పెద్ద ఎదురు దెబ్బే తగిలింది ఈ ఏడాది. కెరీర్లో ఎన్నడూ మురుగదాస్‌కు ఇంతటి చేదు అనుభవం ఎదురు కాలేదు. ‘స్టాలిన్’.. ‘సెవెన్త్ సెన్స్’ లాంటి ఒకట్రెండు సినిమాలు మురుగదాస్‌కు నిరాశను మిగిల్చాయి కానీ.. అవి మరీ ‘స్పైడర్’ స్థాయిలో దెబ్బ కొట్టలేదు.

దీంతో చాలా అప్సెట్ అయిన మురుగదాస్.. తన తర్వాతి సినిమాను ఎలాగైనా హిట్ చేయాలన్న పట్టుదలతో సాగుతున్నాడు. తుపాకి, కత్తి లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత విజయ్ హీరోగా మరో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నాడు మురుగదాస్. ఈ చిత్ర స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి కావచ్చింది. జనవరి 1న ఈ సినిమా అనౌన్స్‌మెంట్ ఉంటుందంటున్నారు.

ఈలోపు మురుగదాస్ మరో క్రేజీ ప్రాజెక్టును ఓకే చేసినట్లు సమాచారం. హాలీవుడ్లో దశాబ్దంన్నర కిందట వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘మిలియన్ డాలర్ బేబీ’ని హిందీలో రీమేక్ చేయబోతున్నాడట మురుగదాస్. ‘మిలియన్ డాలర్ బేబీ’కి అప్పట్లో ఆస్కార్ అవార్డులు కూడా వచ్చాయి. ఈ చిత్రంలో కథానాయికగా నటించిన హిల్లరీ స్వాంగ్ ఉత్తమ కథానాయికగా ఎంపికైంది.

ఒక కోచ్ ఓ పేద అమ్మాయిని అంతర్జాతీయ స్థాయి బాక్సర్‌గా తీర్చిదిద్దే కథతో తెరకెక్కిన సినిమా. హిందీలో అక్షయ్ కుమార్ ఆ కోచ్ పాత్ర చేయనున్నాడట. మెరీనా కుమార్ కథానాయికగా నటిస్తుందట. కొంచెం ‘గురు’ సినిమా పోలికలున్నప్పటికీ ఈ కథ సాగే తీరు భిన్నంగా ఉంటుందంటున్నారు. విజయ్ సినిమాను పూర్తి చేశాక మురుగదాస్ ఈ ప్రాజెక్టును టేకప్ చేస్తాడని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు