సునీల్‌ని చూసి అయినా నేర్చుకోవాలిగా

సునీల్‌ని చూసి అయినా నేర్చుకోవాలిగా

కమెడియన్లు హీరోలుగా మారినపుడు వారు చేసే సినిమాలపై ప్రేక్షకులకి కొన్ని అంచనాలుంటాయి. వారు అన్ని సినిమాల్లో చేసే కామెడీనే మరింత ఎక్కువ మోతాదులో చేస్తారని ఆడియన్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. అయితే మిగతా హీరోల మాదిరిగా డాన్సులు, ఫైట్లు చేస్తామంటే అవి చేయడానికి అంతమంది హీరోలున్నపుడు కొత్తగా కమెడియన్ల అవసరమేంటని అనేస్తారు.

అలా చేసిన ఒకటి, రెండు సినిమాలు చూస్తారేమో కానీ ఆ తర్వాత మాత్రం రిజెక్ట్‌ చేసేస్తారు. ఇక్కడ సునీల్‌ అయినా, తమిళంలో సంతానం అయినా ఇదే అనుభవాన్ని చవిచూసారు. గతంలో వేణుమాధవ్‌ కూడా ఇలాంటి ట్రిక్కులే ప్లే చేసి పూర్తిగా కనుమరుగయ్యాడు. ఇంతమందిని చూస్తున్నా కానీ సప్తగిరి మాత్రం తాను హీరోనే అంటున్నాడు.

సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లో చేసిన అతికే విమర్శకులతో అక్షింతలు వేయించుకున్నాడు. మాస్‌లో వున్న ఫాలోయింగ్‌ వల్ల ఆ సినిమా సేఫ్‌గా గట్టెక్కిపోయింది. అయితే తనని ప్రేక్షకులు అలాగే చూడాలని అనుకుంటున్నారని మళ్లీ ఇప్పుడు సప్తగిరి ఎల్‌ఎల్‌బిలో కూడా కామెడీ తగ్గించి మిగిలిన చిన్నెలు ఎక్కువ ప్రదర్శించాడు.

ట్రెయిలర్‌లోనే సప్తగిరి ఇందులో ఏమి చేస్తాడనేది క్లియర్‌గా తెలుస్తోంది. హిందీలో మంచి చిత్రంగా పేరు తెచ్చుకున్న జాలీ ఎల్‌ఎల్‌బి సోల్‌ని పాడుచేసే విధంగా వుందని ఈ ట్రెయిలర్‌ చూసిన వారు అభిప్రాయ పడుతున్నారు. అయితే మాస్‌ తనని ఇలాగే ఆదరిస్తారని సప్తగిరి నమ్ముతున్నాడు. టైటిల్‌లో కూడా తన పేరునే వాడుకుంటోన్న సప్తగిరి తత్వం బోధ పడేందుకు ఎంత సమయం పడుతుందో మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు