2.0 ఎప్పుడో కానీ.. కాలా మాత్రం ఆ రోజే

2.0 ఎప్పుడో కానీ.. కాలా మాత్రం ఆ రోజే

నిన్న రాత్రి నుంచి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ‘2.0’ సినిమా గురించే చర్చించుకుంటోంది. జనవరి 25 నుంచి ఈ చిత్రాన్ని ఏప్రిల్‌కు వాయిదా వేస్తున్నట్లు అధికారికంగానే ప్రకటించింది చిత్ర బృందం. ఐతే ఏప్రిల్ రిలీజ్ అనే మాట చెప్పేసి.. రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించకపోవడం తీవ్ర గందరగోళానికి దారి తీస్తోంది.

ఈ విషయంలో అన్ని ఇండస్ట్రీల వాళ్లూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఈ కన్ఫ్యూజన్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. ముందు ప్రచారం జరిగినట్లు ఈ సినిమా ఏప్రిల్ 13న వస్తుందా లేకా ఇప్పుడు చర్చల్లో ఉన్నట్లు ఏప్రిల్ 27కు షెడ్యూల్ అవుతుందా తెలియక అయోమయానికి గురవుతున్నారు.

ఐతే ‘2.0’ గందరగోళం ఇలా కొనసాగుతుండగానే.. మరోవైపు రజినీకాంత్ నటిస్తున్న మరో సినిమా ‘కాలా’ రిలీజ్ డేట్ విషయంలో చిత్ర బృందం ఒక క్లారిటీ ఇచ్చేసింది. వచ్చే ఏడాది ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుందని తమిళ మీడియాకు.. కోలీవుడ్ నిర్మాతలకు హింట్ ఇచ్చింది. ‘కబాలి’ ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రజినీ అల్లుడు ధనుష్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

నిజానికి ఈ చిత్రాన్ని ఏప్రిల్ లేదా మే నెలలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ‘2.0’ వాయిదా పడ్డ నేపథ్యంలో దానికి, దీనికి నాలుగు నెలల గ్యాప్ ఉండాలన్న ఉద్దేశంతో ఆగస్టుకు వాయిదా వేశారు. వచ్చే ఏడాది ద్వితీయార్ధానికి షెడ్యూల్ అయిన తమిళ సినిమాలు ‘కాలా’తో పోటీ లేకుండా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు అక్కడి నిర్మాతలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు