నాని బేనర్‌కు ఆ పేరెందుకు పెట్టాడు?

నాని బేనర్‌కు ఆ పేరెందుకు పెట్టాడు?

ఇంతకుముందు ‘డి ఫర్ దోపిడీ’ అనే సినిమాలో నిర్మాణ భాగస్వామిగా ఉన్న నాని.. ఇప్పుడు పూర్తి స్థాయి నిర్మాతగా మారి ‘అ’ అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల కిందటే తన బేనర్ పేరు.. ఈ చిత్ర టైటిల్ లోగో లాంచ్ చేశాడు నాని. తన బేనర్‌కు ‘వాల్ పోస్టర్ సినిమా’ అనే పేరు పెట్టుకున్నాడు నాని.

ఈ బేనర్‌కు నాని తన కొడుకు అర్జున్ పేరో.. తన పేరో పెట్టుకోకుండా ఇలా ‘వాల్ పోస్టర్’ అనే పేరు పెట్టుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే ఇందుకు కారణాలు లేకపోలేదంటున్నాడు నాని. ఆ కారణాలేంటో నాని మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘నాకు వాల్ పోస్టర్లు అంటే చాలా ఇష్టం. నేను హైదరాబాద్ అమీర్ పేటలో ఉన్నపుడు అక్కడి నుంచి సత్యం థియేటర్‌కు వెళ్లే దారిలో ఎం.సి.జె గ్రౌండ్ దగ్గర ఒక గోడ ఉండేది. ఆ గోడ మీద ఎప్పుడూ సినిమా పోస్టర్లు అంటించేవాళ్లు. ఆ దారి నుంచి వెళ్లేటపుడు ఏ పనిలో ఉన్నా ఆ గోడను నేను చూడాల్సిందే. ఓ సినిమా వెంటనే చూడాలనిపించేలా వాల్ పోస్టర్లు ఇచ్చే ఎగ్జైట్మెంట్ కానీ.. కిక్కు కానీ.. ఇంకేదీ ఇవ్వదు. ఓ ట్రైలర్, ఓ టీజర్.. సోషల్ మీడియా ఇవేవీ కూడా అంత ఆసక్తి రేకెత్తించవు. వాల్ పోస్టర్లోనే ఏదో తెలియని ఒక సినిమాటిక్ హైప్ ఉందని నా అభిప్రాయం. అందుకే నా నిర్మాణ సంస్థకు ‘వాల్ పోస్టర్ సినిమా’ అనే పేరు పెట్టుకున్నా’’ అని నాని వెల్లడించాడు. ప్రశాంత్ వర్మ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రంలో చేప పాత్రకు నాని వాయిస్ ఓవర్ ఇస్తున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు