బాత్రూం గొడవ పై హీరో మాట్లాడాడు

బాత్రూం గొడవ పై హీరో మాట్లాడాడు

కోలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత‌, ద‌ర్శ‌కుడు, న‌టుడు టి.రాజేంద‌ర్‌, ఆయ‌న కొడుకు హీరో శింబుకు వివాదాల‌తో సావాసం చేయ‌డం అల‌వాటే. `క‌బాలి` ఫేం ధ‌న్సిక‌ను రాజేంద‌ర్ ఓ వేదిక‌పై అంద‌రిముందు అవ‌మానించిన సంగ‌తి తెలిసిందే. దీంతో, న‌డిగ‌ర్ సంఘం అధ్య‌క్షుడు విశాల్...రాజేంద‌ర్ పై మండిప‌డ్డారు.

ఇక‌, శింబు స‌రైన స‌మయానికి షూటింగ్ లకు రాకుండా చాలా మంది నిర్మాత‌ల‌ను ఇబ్బందిపెట్టాడ‌ని, అత‌డి పై ఏకంగా నిషేధం విధించే యోచ‌న‌లో న‌డిగ‌ర్ సంఘం ఉంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. తాను నిర్మించిన‌  ‘అన్బనవన్‌ అసరధవన్‌ అదంగధవన్‌’ (ఏఏఏ)’ సినిమా షూటింగ్ కు శింబు స‌రిగ్గా హాజ‌రుకాలేద‌ని, ఆఖ‌రికి డ‌బ్బింగ్ కూడా బాత్రూంలో నుంచి చెప్పి పంపాడ‌ని నిర్మాత మైకేల్ రాయప్పన్ ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ ఆరోపించారు. అతడి వల్ల తాను న‌ష్టపోయిన రూ.20 కోట్లు పరిహారంగా ఇప్పించి, శింబుపై నిషేధం కూడా విధించాలని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం సంచ‌ల‌నం రేపింది. ఈ నేప‌థ్యంలో ఈ వివాదంపై శింబు స్పందించాడు.

సాధార‌ణంగా ఇటువంటి ఆరోప‌ణ‌లు వ‌చ్చిన‌పుడు ఏ న‌టుడైనా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే దిశ‌గా వ్యాఖ్యానిస్తాడు. కానీ, శింబు మాత్రం త‌న‌దైన `శైలి`లో ఘాటు వ్యాఖ్య‌లు చేశాడు. రాయ‌ప్ప‌న్ వ్య‌వ‌హారంలో అత‌డి వాద‌న మ‌రోలా ఉంది. తాను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేద‌ని,  త‌మిళ ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ నుంచి త‌న‌కెలాంటి రెడ్‌ కార్డ్‌ (నిర్మాత చేసిన ఫిర్యాదు పరిష్కారం అయ్యే వరకూ మరో సినిమాలో నటించేందుకు అవకాశం లేకుండా నిరోధించడం) నోటీసు అందలేద‌ని శింబు చెప్పాడు.

ఒకవేళ త‌న‌కు నోటీసు వస్తే దానిని ఎలా హ్యాండిల్‌ చేయాలో త‌న‌కు బాగా తెలుస‌ని సమాధాన‌మిచ్చాడు. అంతేకాకుండా, నిర్మాత రాయప్పన్ పై ప్ర‌త్యారోప‌ణ‌లు చేశాడు. ఆ సినిమాకు సంబంధించి ఇంకా త‌న‌కు పారితోషికం అందాల్సి ఉంద‌న్నాడు. పారితోషికం విష‌యంలో తాను ఇప్పటికే నడిఘర్‌ సంఘంలో ఫిర్యాదు చేశాన‌ని చెప్పారు. మ‌రి శింబు వ్యాఖ్య‌ల‌పై రాయ‌ప్ప‌న్, న‌డిగ‌ర్ సంఘం ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. రాయ‌ప్ప‌న్ వ్యాఖ్య‌ల‌తో త‌న సినిమాలో శింబును ఓ పాత్ర‌లో తీసుకోవాల‌నుకున్న మ‌ణిర‌త్నం కూడా పున‌రాలోచ‌న‌లో ప‌డ్డ‌ట్లు వార్త‌లు వినిపిస్తు సంగ‌తి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు