సినిమా రిలీజ్ కాకున్నా బావుండే..

సినిమా రిలీజ్ కాకున్నా బావుండే..

గోపీచంద్ హీరోగా నటించిన ‘ఆరడుగుల బుల్లెట్’ అడ్రస్ లేకుండా పోయింది. ‘ఆక్సిజన్’ కూడా ఇలాగే అవుతుందేమో అనుకున్నారంతా. కానీ ఆశ్చర్యకరంగా ఈ సినిమాను విడుదలకు సిద్ధం చేశారు. రిలీజ్ డేట్ పోస్టర్లు వేశారు. పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు.

అయినప్పటికీ నిజంగా ఈ సినిమా థియేటర్లలోకి వస్తుందా అని సందేహంగా చూశారందరూ. కానీ ఆ సందేహాల్ని పటాపంచలు చేస్తూ ‘ఆక్సిజన్’ ఈ గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కానీ ఈ సినిమా చూశాక.. దీనికి వస్తున్న వసూళ్లు చూశాక.. ఇది విడుదల కాకుండా ఆగిపోయి ఉంటేనే మేలంటున్నారు గోపీచంద్ అభిమానులు.

గోపీచంద్ కెరీర్లో అత్యంత చెత్త సినిమాల్లో ఒకటిగా ‘ఆక్సిజన్’ పేరు తెచ్చుకుంది. ఇది రిలీజవ్వడం వల్ల గోపీకి ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. అతడి ఫ్లాపుల పరంపరలో ఇంకో సినిమాగా ఇది నిలిచింది. అతడి మార్కెట్‌ను ఈ సినిమా మరింతగా దెబ్బ తీసేదే. దీని ప్రభావం కచ్చితంగా అతడి తర్వాతి సినిమాపై పడేదే.

దీని కంటే ముందు వచ్చిన ‘గౌతమ్ నంద’ కూడా ఫ్లాప్ అయినప్పటికీ.. చెత్త సినిమాగా పేరు తెచ్చుకోలేదు. పర్వాలేదనిపించింది. గోపీ ఏదో డిఫరెంటుగా ట్రై చేశాడన్న పేరైనా దక్కింది. ఐతే ‘ఆక్సిజన్’ ఏమాత్రం మంచి ఫీలింగ్ తీసుకురాలేదు. గోపీకి ఇది అన్ని రకాలుగా చేటు చేసింది. కెరీర్లో ప్రతిష్టాత్మకమైన 25వ సినిమాతో రెడీ అవుతున్న తరుణంలో ‘ఆక్సిజన్’ అతడికి పెద్ద ఎదురు దెబ్బే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు