సప్తగిరి.. నక్కతోక తొక్కాడు

సప్తగిరి.. నక్కతోక తొక్కాడు

ఈ రోజుల్లో చిన్న సినిమాకు పోటీ లేని వీకెండ్ దొరకడం.. చాలినన్ని థియేటర్లు లభించడం చాలా చాలా కష్టమైపోతోంది. మంచి డేట్ కోసం చూసి చూసి.. పోటీ లేని సమయం చూసి రిలీజ్ ఫిక్స్ చేసుకున్నా.. సడెన్‌గా వేరే సినిమాలు వచ్చి దిగిపోతాయి. నవంబరులో చాలా సినిమాలకు ఇలాంటి ఇబ్బందే ఎదురైంది.

రాజశేఖర్ ‘గరుడవేగ’.. మంచు మనోజ్ ‘ఒక్కడు మిగిలాడు’.. శ్రీవిష్ణు ‘మెంటల్ మదిలో’ సినిమాలకు ఇలాంటి తలనొప్పే తప్పలేదు. వీటికి ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరకలేదు. ఈ మూడు సినిమాల్లో ‘గరుడవేగ’.. ‘మెంటల్ మదిలో’ సినిమాలకు మంచి టాక్ వచ్చినా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. ఇలాంటి తరుణంలో కమెడియన్ టర్న్డ్ హీరో సప్తగిరి మాత్రం నక్క తోక తొక్కినట్లే కనిపిస్తున్నాడు.

ఎందుకో ఏమో కానీ.. డిసెంబరులో రెండు, మూడు వారాల మీద నిర్మాతల కళ్లు పడలేదు. చివరి రెండు వారాల్లో తీవ్రమైన పోటీ ఉండగా.. ముందు వారాల్ని అలా ఖాళీగా వదిలేశారు. దీంతో సప్తగిరి తెలివిగా డిసెంబరు 8కు తన సినిమా ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బీ’ని షెడ్యూల్ చేసుకున్నాడు. దీనికి పోటీగా సుమంత్ సినిమా ‘మళ్ళీ రావా’ వస్తున్నపటికీ దానికి అంత బజ్ లేదు. పైగా అది క్లాస్ సినిమా.

సప్తగిరి సినిమాపై మాస్‌లో మంచి అంచనాలే ఉన్నాయి. బి, సి సెంటర్లలో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ బాగానే వచ్చేలా ఉన్నాయి. రామ్ చరణ్, నాని, సుకుమార్ లాంటి సెలబ్రెటీలతో తన సినిమాను బాగానే ప్రమోట్ చేయిస్తున్నాడు సప్తగిరి. బాలీవుడ్ హిట్ మూవీ ‘జాలీ ఎల్ఎల్బీ’కి రీమేక్ కావడంతో ‘సప్తగిరి ఎల్‌ఎల్బీ’లో కంటెంట్ కూడా బాగానే ఉంటుందని భావిస్తున్నారు. చూద్దాం మరి సప్తగిరి ఎలాంటి ఫలితాన్నందుకుంటాడో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు