చరణ్‌తో.. పవన్‌తో.. ఆపై సోలోగా

చరణ్‌తో.. పవన్‌తో.. ఆపై సోలోగా

తమిళంలో హీరో మంచి పేరు సంపాదించిన ఆది పినిశెట్టి అచ్చ తెలుగు కుర్రాడన్న సంగతి తెలిసిందే. రవిరాజా పినిశెట్టి కొడుకైన ఆది.. ముందు తెలుగులోనే ‘ఒక విచిత్రం’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. కానీ ఆ సినిమా ఆడలేదు. తర్వాత తమిళంలో ‘మృగం’ అనే సెన్సేషనల్ మూవీలో నటించి అక్కడి ప్రేక్షకుల మనసు గెలిచాడు. ‘ఈరం’ (తెలుగులో వైశాలి) అతడిని హీరోగా నిలబెట్టింది.

ఆ తర్వాత మరిన్ని మంచి సినిమాలు చేశాడు. ఆపై తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చి.. ‘గుండెల్లో గోదారి’లో హీరోగా నటించాడు కానీ.. అది కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఐతే తెలుగులో అతను విలన్ వేషంలోకి మారాక మంచి రిజల్ట్ వచ్చింది. ‘సరైనోడు’లో వైరం ధనుష్‌గా అతడి పెర్ఫామెన్స్ అందరికీ నచ్చింది.

దీంతో ఆదికి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి తెలుగులో. ఆల్రెడీ ‘నిన్నుకోరి’లో పాజిటివ్ క్యారెక్టర్‌తో మెప్పించాడు. ఇప్పుడు రామ్ చరణ్‌తో ‘రంగస్థలం’లో.. పవన్ కళ్యాణ్‌తో ‘అజ్నాతవాసి’లో నటిస్తున్నాడు ఆది. దీని తర్వాత అతను సోలో హీరోగా తెలుగులో మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుండటం విశేషం.

ఇంతకుముందు ‘లవర్స్’ అనే సినిమా తీసిన హరినాథ్ దర్శకత్వంలో ఆది హీరోగా నటించనున్నాడు. తెలుగులో హీరోయిన్‌గా చేసి.. బాలీవుడ్ వెళ్లిపోయి అక్కడ మంచి పేరు సంపాదించిన తాప్సి ఈ సినిమాలో కథానాయికగా చేస్తుందట. ఆది-తాప్సి ఇంతకుముందే ‘గుండెల్లో గోదారి’లో నటించారు. ఆ సినిమా ఫలితమేంటో తెలిసిందే. మరి ఈసారైనా ఈ జంటకు విజయాన్నందిస్తుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు