మోదీపై టాలీవుడ్ పెద్దాయన ఫైర్

మోదీపై టాలీవుడ్ పెద్దాయన ఫైర్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, పీఎం మోదీపై తమిళ, కన్నడ నటులు అగ్గి మీద గుగ్గిలమవుతున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్, ప్రకాశ్ రాజ్, విజయ్ వంటివారంతా వివిధ రూపాల్లో తమ ఆగ్రహాన్ని వెల్లగక్కుతున్నారు. అయితే... ఈ వ్యవహారాల్లో టాలీవుడ్ నుంచి ఎవరూ ఇంతవరకు పెద్దగా స్పందించలేదు. అయితే... తాజాగా సీనియర్ దర్శకనిర్మాత తమ్మరెడ్డి భరద్వాజ మండిపడ్డారు. దేశానికి మంచి ప్రధాని కావాలన్న ఉద్దేశంతో తామంతా ఎన్నుకుంటే… మోదీ మాత్రం కొందరికి మాత్రమే ప్రధాని అన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్న అనుమానం కలుగుతోందన్నారు.

సినిమా వాళ్లపై బీజేపీ నేతలు వరుసగా నోటికొచ్చిన వ్యాఖ్యలు చేస్తుంటే ప్రధానిగా ఆయన చూస్తూ ఊరుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. భావ ప్రకటనా స్వేచ్చకు మీ పార్టీ నేతలు పదేపదే అడ్డుపడుతుంటే ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఒక నేత ఏకంగా సినిమా వాళ్ల భార్యలంతా ఎవరితోనో వెళ్లిపోతున్నారు.. వారు మొగుళ్లను మారుస్తారంటూ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ఇటువంటి వారిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ప్రధానిగా మీకులేదా అని ప్రశ్నించారు.

మరోవైపు పద్మావతి సినిమా వివాదంపైనా ఆయన మాట్లాడారు. దీపికా పదుకొణె తల తీసేయ్యాలని.. ముక్కు కోసెయ్యాలని అంటున్నారు... సంజయ్ లీలా భన్సాలీ తల నరికి తీసుకొస్తే రూ.5కోట్లు, 10కోట్లు ఇస్తామని ఓపెన్‌గా టీవీల్లో చెబుతున్నా ప్రభుత్వం వైపు నుంచి స్పందన ఉండడం లేదు. ‘‘మీరు దేశానికి ప్రధాని గానీ…. ఒక వర్గానికో, ఒక సెక్షన్‌కో కాదు’’ అంటూ భరద్వాజ సీరియస్ అయ్యారు. బీజేపీ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే మళ్లీ ఆటవిక సమాజం వైపు వెళ్తున్నామా అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు