ఇప్పుడైనా థియేటర్లకు వస్తారా?

ఇప్పుడైనా థియేటర్లకు వస్తారా?

పెద్ద సినిమాలు లేవు కదా అని.. ఎప్పట్నుంచో విడుదులకు నోచుకోకుండా సినిమాలన్నింటినీ వరుసబెట్టి ఈ నెలలో థియేటర్లలోకి దించేశారు నిర్మాతలు. ఐతే వారం వారం లెక్కకు మిక్కిలిగా సినిమాలు రావడంతో జనాలకు చిరాకొచ్చేసింది. ఇన్ని సినిమాల్లో మంచిదేదో తేల్చుకోలేకపోయారు. పైగా పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో థియేటర్లకు జనాలు రావడం తగ్గిపోయింది. గత వారం ఏడెనిది సినిమాల దాకా రిలీజైతే.. దేనికీ వసూళ్లు లేవు.

‘మెంటల్ మదిలో’ లాంటి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా సైతం జనాలు లేక వెలవెలబోతోంది. మరి ఈ వారమైనా పరిస్థితి మారుతుందా.. ఈ వీకెండ్లో వస్తున్న మూడు సినిమాలైనా జనాల్ని థియేటర్లకు రప్పిస్తాయా అని చూస్తోంది టాలీవుడ్. చాలా కాలంలో విడుదల కోసం చూస్తున్న గోపీచంద్ సినిమా ‘ఆక్సిజన్’తో పాటు తమిళ డబ్బింగ్ మూవీ ‘ఇంద్రసేన’ సైతం గురువారం విడుదలవుతున్నాయి.

శుక్రవారం సాయిధరమ్ తేజ్ సినిమా ‘జవాన్’ కూడా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇప్పటికి బుకింగ్ ట్రెండ్స్ చూస్తుంటే పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. మామూలు సమయాల్లో ఉన్నంత సందడి ఇప్పుడు కనిపించడం లేదు. జనాల మూడ్ ఇంకా మారినట్లు లేదు. వీటి టాక్‌ను బట్టి కలెక్షన్లు ఉంటాయేమో మరి. గోపీచంద్ హిట్టు ముఖం చూసి చాలా కాలం కావడం, పైగా సినిమా పలుమార్లు వాయిదా పడటంతో ‘ఆక్సిజన్’కు ప్రతికూలంగా కనిపిస్తోంది.

ఈ సినిమా ఆడకపోతే గోపీ కెరీర్ మరింతగా ఇబ్బందుల్లో పడుతుంది. మరోవైపు ‘బిచ్చగాడు’తో మంచి తెలుగులో ఫాలోయింగ్ సంపాదించిన విజయ్ ఆంటోనీ.. ఆ తర్వాత ‘బేతాళుడు’, ‘యమన్’ సినిమాలతో నిరాశ పరిచాడు. ‘ఇంద్రసేన’ అతడికి కమ్ బ్యాక్ మూవీ అవుతుందేమో చూడాలి. మరోవైపు సాయిధరమ్‌తేజ్, బీవీఎస్ రవి ఇద్దరూ హిట్టు కోసం చాలా డెస్పరేట్‌గా ఉన్నవాళ్లే. వారికి ‘జవాన్’ ఎలాంటి ఫలితాన్నందిస్తుందో చూడాలి. అసలు వీటిలో ఏది జనాల్ని థియేటర్లకు ఆకర్షిస్తుందో మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు