2.0 కాదు.. విశ్వరూపం-2

2.0 కాదు.. విశ్వరూపం-2

ఈ ఏడాది ఏప్రిల్ 28న ‘బాహుబలి: ది కంక్లూజన్’ రిలీజయ్యాక.. భారతీయ ప్రేక్షకుల దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన తేదీ 2018 జనవరి 26. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధికంగా రూ.450 కోట్ల బడ్జెట్లో శంకర్-రజినీకాంత్‌ల మెగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘2.0’ను రిలీజ్ చేయాలనుకున్నది ఆ తేదీకే మరి.

ఈ ఏడాది దీపావళికే విడుదల కావాల్సిన ఆ చిత్రాన్ని జనవరి 26కు వాయిదా వేసి.. ఆ రోజున పక్కాగా ప్రేక్షకుల ముందుకు తేవాలని భావించింది చిత్ర బృందం. కానీ వాళ్ల ప్రణాళికలు ఫలించలేదు. ఆ తేదీకి సినిమా రెడీ అయ్యే అవకాశం లేదని తేలిపోవడంతో ఏప్రిల్ 13కు వాయిదా వేయాలన్న నిర్ణయానికి వచ్చారు.

దీంతో రిపబ్లిక్ డే వీకెండ్ మీద వేరే సినిమాలు ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే అక్షయ్ కుమార్ సినిమా ‘ప్యాడ్ మ్యాన్’ జనవరి 26కు ఫిక్సయింది. దీనికి పోటీగా దక్షిణాది నుంచి మరో క్రేజీ సినిమా రాబోతున్నట్లు సమాచారం. కమల్ హాసన్ లాంగ్ డిలేయ్డ్ మూవీ ‘విశ్వరూపం-2’ను జనవరి 26కే రిలీజ్ చేయాలన్న ప్రణాళికలో ఉన్నారట. మూడేళ్ల పాటు ల్యాబుల్లో మగ్గిన ఈ సినిమాను కొన్ని నెలల కిందటే బయటికి తీశాడు కమల్. నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ నుంచి ఈ సినిమాను తీసుకున్న కమల్.. తన సొంత ఖర్చుతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేస్తున్నాడు.

ఇక షూటింగ్ కొంచెం బ్యాలెన్స్ ఉండటంతో దాన్ని కూడా పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఈ షెడ్యూల్  వారం పది రోజులు మాత్రమే ఉంటుందట. చెన్నైలో ఈ పని నడుస్తోంది. మిగతా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసి జనవరి 26న ‘విశ్వరూపం-2’ను రిలీజ్ చేయాలని చూస్తున్నాడు కమల్. 2013 సంక్రాంతికి రిలీజైన ‘విశ్వరూపం’ అప్పట్లో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అంటే తొలి భాగం వచ్చిన ఐదేళ్లకు రెండో భాగం రాబోతోందన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English