కలర్స్ స్వాతి.. కృష్ణవంశీ.. ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ

కలర్స్ స్వాతి.. కృష్ణవంశీ.. ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ

‘కలర్స్’ ప్రోగ్రాంతో మంచి పేరు సంపాదించిన స్వాతి.. ‘డేంజర్’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐతే ఆ సినిమా కంటే ముందు తనకు వేరే అవకాశాలు వచ్చినా ఒప్పుకోలేదని.. ‘డేంజర్’ కూడా విచిత్రమైన పరిస్థితుల్లో అంగీకరించానని అంటోంది స్వాతి. కమెడియన్ ఆలీ నిర్వహించే టీవీ కార్యక్రమంలో భాగంగా స్వాతి ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి చెప్పింది.

‘‘డేంజర్ సినిమా అవకాశం వచ్చినపుడు నేను మా అమ్మ కలిసి కృష్ణవంశీ గారి ఆఫీసుకి వెళ్లాం. అక్కడ ఆయన గదిలో కూర్చుని ఉన్నారు. వెళ్లగానే స్క్రిప్టు చెబుతారా అని అడిగాం. ఆయన ఒక తెల్ల కాగితం తీసుకుని దానిపై పెన్నుతో కేవీ అని రాశి మా వైపు తోశారు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా అని అడిగారు. మా అమ్మ వెంటనే.. ‘మీరేం సినిమాలు తీశారండీ’ అని అడిగింది. మేం ఆయన తీసిన నిన్నే పెళ్లాడతా, మురారి చూసి ఉన్నప్పటికీ ఆయనే కృష్ణవంశీ అని తెలియదు. నన్నే ఇలా అడుగుతారా అంటూ ఆయన కొంచెం కోప్పడ్డారు. ముందు నువ్వు నటించగలవో లేదో నీకు స్క్రీన్ టెస్టు చేస్తా అన్నారు. నేను బదులుగా.. నేను స్క్రీన్ టెస్టు పాసైతే స్క్రిప్టు చెబుతారా అని అడిగాను. తర్వాత ఆయన స్క్రీన్ టెస్టు చేసి.. బాగా చేశావంటూ మెచ్చుకుని స్క్రిప్టు చెప్పారు. ఆ సినిమా చేసేటపుడు ఆయన గొప్పదనమేంటో తెలిసింది. ఈ సినిమా అయ్యాక నా పేరుతో ఏదో ఎంఎంఎస్ సర్క్యులేట్ అవుతున్నట్లు గాసిప్స్ వచ్చాయి. అప్పుడు కృష్ణవంశీ గారు ఒక వైబ్ సైట్ వాళ్లకు ఫోన్ చేసి.. క్లాస్ పీకారు. వెంటనే ఆ ఆర్టికల్ తీయించారు. ఈ విషయం వంశీ గారి అసిస్టెంట్ల ద్వారా నాకు తెలిసింది. అందుకే ఆయనంటే నాకెంతో గౌరవం’’ అని స్వాతి వెల్లడించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు