ఆ సినిమాకు అసలు డైరెక్టర్ జీవితేనట

ఆ సినిమాకు అసలు డైరెక్టర్ జీవితేనట

నటి జీవిత.. తన భర్త కోసం దర్శకురాలిగా కూడా మారింది. తొలిసారి ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శేషు’. ఆ సినిమా నిరాశ మిగిల్చినప్పటికీ ఆ తర్వాత కూడా ఆమె కొన్ని సినిమాలు తీసింది. రాజశేఖర్‌కు లేక లేక ఓ విజయాన్నందించిన ‘ఎవడైతే నాకేంటి’ సినిమాకు దర్శకులుగా సముద్రతో పాటు జీవిత పేరు కూడా పడటం తెలిసిందే.

ఐతే సముద్ర పేరును ఏదో వెయ్యాలి కాబట్టి వేశామని.. నిజానికి ఈ సినిమా అంతా జీవితే తీసిందని రాజశేఖర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తన భార్య టాలెంట్ గురించి.. ఇందులో రాజశేఖర్ వివరించాడు.

‘‘నేను హీరోగా తెరకెక్కిన ‘సింహరాశి’ సినిమా విజయంలోనూ జీవిత పాత్ర ఉంది. అది ‘మాయి’ అనే తమిళ హిట్ సినిమాకు రీమేక్. ఆ సినిమాను ఉన్నదున్నట్లుగా తెలుగులో తీయాలని నేను అనుకున్నాను. దీనికి దర్శకుడిగా ఎవరైతే బాగుంటుందని నిర్మాత ఆర్.బి.చౌదరి కొన్ని ఆప్షన్లు ఇస్తే సముద్రను నేనే ఎంచుకున్నాను. ఐతే అతను ఒరిజినల్ నుంచి కొన్ని సీన్లు మార్చేశాడు. డైలాగులు కూడా మార్చేశాడు. నాకు సరిగా అనిపించలేదు. ఇలా అయితే సినిమా చేయనన్నాను. దీంతో మీకు ఎలా కావాలంటే అలానే చేద్దాం అన్నాడు. అప్పుడు జీవితను తీసుకొచ్చి ఏ రోజుకారోజు రాత్రి ఒరిజినల్ నుంచి సన్నివేశాలు చూడటం.. దానికి జీవిత డైలాగులు రాయడం.. మరుసటి రోజు షూటింగ్ చేయడం.. ఇలా చేశాం. ఆ సినిమా మంచి ఫలితాన్నందుకుంది. తర్వాత ‘ఎవడైతే నాకేంటి’ సినిమాకు స్ఫూర్తి ‘లయన్’ అనే మలయాళ సినిమా. ఐతే ఆ సినిమా నుంచి లైన్ మాత్రమే తీసుకుని మార్పులు చేర్పులు చేసి నేనే స్క్రిప్టు రాశాను. ఆ సినిమా మొదలయ్యాక సముద్ర సరిగా డీల్ చేయట్లేదనిపించింది. అతడికి పోలీసులు.. అధికారులు.. ఈ వ్యవస్థ మీద సరిగా గ్రిప్ లేదనిపించింది. దీంతో జీవితే డైరెక్ట్ చేయడం మొదలుపెట్టింది. సముద్ర ఊరికే యాక్షన్.. కట్ అని మాత్రమే చెప్పేవాడు. అతడు ఫీలవ్వకూడదని అలా చేశాం. టైటిల్స్ లో కూడా పేరు వేశాం. అతణ్ని మేం తీసేశాం అంటే తన కెరీర్ పాడవుతుందని అలా చేశాం. నిజానికి ఆ సినిమాను డైరెక్ట్ చేసింది జీవితే’’ అని రాజశేఖర్ వెల్లడించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు