‘శతమానం’ వదులుకోవడానికి అసలు కారణం

‘శతమానం’ వదులుకోవడానికి అసలు కారణం

దిల్ రాజు నిర్మాణంలో శర్వానంద్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘శతమానం భవతి’కి ముందు అనుకున్న హీరో సాయిధరమ్ తేజ్ అన్న సంగతి తెలిసిందే. అతడిని హీరోగా అనుకున్నాకే ఈ స్క్రిప్టు ముందుకు కదిలింది. కానీ సినిమా మొదలయ్యే కొన్ని రోజుల ముందు ఉన్నట్లుండి ఇందులో హీరోను మార్చేశారు. తేజుతో అప్పటికే మూడు సినిమాలు నిర్మించిన దిల్ రాజు.. అతడిని హీరోగా తప్పించడానికి కారణాలేంటో అర్థం కాలేదు.

తేజు ఈ సినిమా చేయలేకపోతుండటంతో తనే ఫోన్ చేసి ఈ కథ వినమని తనకు చెప్పినట్లుగా శర్వానంద్ స్వయంగా వెల్లడించాడు ఇంతకుముందు. మరి ఈ కథ విషయంలో అభ్యంతరాలు లేకుండా.. యూనిట్లో ఎవరితోనూ విభేదాలు కూడా లేకుండా తేజు ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి కారణాలేంటన్నది ఎవరికీ అర్థం కాలేదు. బహుశా డేట్ల సమస్య వల్లే తేజు ఈ సినిమా చేయలేదేమో అనుకున్నారు.

ఐతే ‘శతమానం భవతి’ని వదులుకోవడానికి అసలు కారణమేంటో తేజు ఇప్పుడు చెప్పాడు. డేట్ల సమస్య ఉన్న మాట వాస్తవమే అని.. కానీ దాని కంటే ముఖ్యమైన కారణం మరొకటి ఉందని అతనన్నాడు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే విషయంలో చాలా పట్టుదలతో ఉన్నారని.. ఐతే ఆ పండక్కే తన మావయ్య మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ షెడ్యూల్ అయిందని.. మావయ్యకు పోటీగా తన సినిమా విడుదల కావడానికి తాను అంగీకరించనని.. అందుకే తాను ఈ సినిమా నుంచి తప్పుకుంటానని రాజుకు చెప్పానని తేజు చెప్పాడు. ఐతే అన్నీ తెలిసే చేశాను కాబట్టి ‘శతమానం భవతి’ వదులుకున్నందుకు రిగ్రెట్స్ ఏమీ లేవని అతనన్నాడు.