ఆ హీరోకు ‘మంచి రోజులు వచ్చాయి’

టీనేజీలో ‘గోల్కొండ హైస్కూల్’లో హీరో కాని హీరో పాత్ర చేసిన యువ నటుడు సంతోష్ శోభన్.. ఆ తర్వాత పూర్తి స్థాయి హీరోగా మారి తను నేను, పేపర్ బాయ్ సినిమాల్లో నటించాడు. కానీ అవి అతడికి తీవ్ర నిరాశనే మిగిల్చాయి. దివంగత దర్శకుడు సంతోష్ శోభన్ తనయుడైన ఈ టాలెంటెడ్ యాక్టర్‌కు ఎట్టకేలకు ఓ మంచి విజయం దక్కింది.

యువి క్రియేషన్స్ బేనర్లో సంతోష్ కథానాయకుడిగా బోల్డ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘ఏక్ మిని కథ’ గత నెలలో అమేజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదలై మంచి స్పందన రాబట్టుకుంది. ఈ సినిమాతో ఒక్కసారిగా సంతోష్ దశ తిరిగిపోయినట్లే కనిపిస్తోంది. యూత్‌కు నచ్చే లుక్స్, యాక్టింగ్ స్కిల్స్, ఈజ్ ఉన్న సంతోష్‌.. ఉన్నట్లుండి బిజీ అయిపోయాడు. అతను కథానాయకుడిగా ఇప్పటికే ‘ప్రేమ్ కుమార్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇంతలో మరో సినిమా పట్టాలెక్కింది.

స్టార్ డైరెక్టర్ మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో సంతోష్ శోభన్, మెహ్రీన్ కౌర్ జంటగా ఇటీవలే ఓ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ఓ కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. చడీచప్పుడు లేకుండా మొదలై శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి ‘మంచి రోజులు వచ్చాయి’ అనే పేరు ఖరారు చేశారట.

చూస్తుంటే సంతోష్ కెరీర్‌ను సూచించేలాగా ఈ టైటిల్ పెట్టారేమో అనిపిస్తోంది. అందరూ సంతోష్‌కు మంచి రోజులు వచ్చాయి అనుకుంటున్న తరుణంలో ఇదే టైటిల్‌తో సినిమా చేయడం విశేషమే. అటు ఇటుగా నెల రోజుల వ్యవధిలోనే ఈ సినిమాను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట. తక్కువ బడ్జెట్లో సినిమాను పూర్తి చేసేస్తున్నారు. మారుతి, మెహ్రీన్ లాంటి వాళ్లతో జట్టు కట్టడం అంటే సంతోష్ కెరీర్ మరో స్థాయికి వెళ్తున్నట్లే. ఈ చిత్రానికి థియేట్రికల్ రిలీజ్ ఉండదు. నేరుగా ఓటీటీలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.