ఇక్కడి అమ్మాయిలు అందుకు కూడా పనికిరారా?

ఇక్కడి అమ్మాయిలు అందుకు కూడా పనికిరారా?

తెలుగు సినిమాల్లో హీరోయిన్లుగా తెలుగు అమ్మాయిలు కనిపించడం చాలా అరుదైన విషయం. తెలుగమ్మాయి.. తెలుగుదనం.. ఇలాంటి మాటలు పాటల్లో వినిపిస్తాయి కానీ ఆన్ స్క్రీన్ కనిపించడం ఓ అద్భుతంలా మారిపోయింది. అడపాదడపా ఒకరిద్దరు హీరోయిన్లుగా మారినా.. వారికి ఛాన్సులు ఇచ్చే మేకర్స్ మహానుభావులు కనిపించరు.

తెలుగు అమ్మాయిలను పట్టించుకోకుండా పరాయి భాషల పాపల కోసం వెంపర్లాడడానికి కారణం అంటూ.. గ్లామర్ షోను చెబుతారు తెలుగు సినీ జనాలు. ఇక్కడోళ్లు అయితే ఎక్స్ పోజింగ్ చేయడానికి.. ఈ ట్రెండ్ కి తగినట్లుగా అందాలు ఒలకబోయడానికి అభ్యంతరాలు చెబుతారన్నది వీరి వాదన. అలా ఇక్కడకు ఇంపోర్ట్ అయిన వారు చాలామందే ఉన్నారు. ఇప్పుడ సవ్యసాచి మూవీతో నిధి అగర్వాల్ ను టాలీవుడ్ కి తీసుకొస్తున్నాడు నాగచైతన్య. తనది పక్కా ట్రెడిషనల్ క్యారెక్టర్ అంటోందీ అల్ట్రా మోడర్న్ భామ. మలయాళీ కుట్టి అను ఇమాన్యుయేల్ కూడా ఆఫ్ స్క్రీన్ ఫుల్ గ్లామరస్ గా ఉంటుంది. కానీ ఈమెను పద్ధతైన పాత్రలలోనే చూపిస్తున్నారు.

కేరళకు చెందిన మరో భామ కీర్తి సురేష్ అయితే.. అసలు గ్లామర్ షోకి దూరం దూరం అంటుంది. అయినా సరే వరుస ఆఫర్స్ తో దూసుకుపోతోంది. అనుపమా పరమేశ్వరన్ కూడా అందాల మోత మోగించే హీరోయిన్ కాదు. నివేదా థామస్ అయితే అసలు ఎక్స్ పోజింగ్ అనే మాటకు కూడా దూరంగా ఉంటుంది. వీరంతా పద్ధతైన పాత్రలనే చేస్తూ.. టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు.

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. గ్లామర్ పాత్రలు అయితే తెలుగమ్మాయిలు చేయరు అంటూ దూరం పెట్టే తెలుగు సినీ జనాలు.. ఆ అవసరం లేని రోల్స్ కు కూడా పరాయి భాషల భామలనే తెచ్చుకుంటున్నారు. స్టార్స్ కోసం వెదుకుతున్నారా అంటే అదీ లేదు. లాంఛింగ్ సమయం నుంచే వీరు సాంప్రదాయంగా కనిపిస్తున్నారు. మరి తెలుగమ్మాయిలు సాంప్రదాయమైన పాత్రలకు కూడా పనికి రారని మన మేకర్స్ మెంటల్ గా ఫిక్స్ అయిపోయారేమో!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు