మనోడి టాలెంటుకి ఆయన ఫిదా

మనోడి టాలెంటుకి ఆయన ఫిదా

పొరుగింటి పుల్లకూరు రుచి అనే సామెత గురించి తెలిసిందే. సినీ పరిశ్రమలో హీరోయిన్ల విషయంలో ఇదే రుజువవుతూ ఉంటుంది. తెలుగమ్మాయిల్లో మంచి టాలెంట్ ఉన్నా మనోళ్లు పట్టించుకోరు. అందుకే స్వాతి, అంజలి, శ్రీదివ్య, ఆనంది, బిందు మాధవి లాంటి వాళ్లు తమిళంలోకి వెళ్లిపోయి అక్కడ మంచి పేరు సంపాదించారు. మంచి స్థాయికి వెళ్లారు. వాళ్లకు తెలుగులో మాత్రం పెద్దగా అవకాశాలు వచ్చింది లేదు. హీరోయిన్ల విషయంలోనే కాదు.. విలన్ల విషయంలోనూ మనోళ్లకు మనోళ్లు ఆనరనే విమర్శలున్నాయి. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఈ విషయమే ఎప్పుడూ చెబుతూ ఉంటారు. అందుకాయన చాలా ఉదాహరణలు కూడా ఇస్తుంటారు.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ విలన్ అజయ్‌ను చూస్తే ఇదే నిజమనిపిస్తుంది. తనకు కీలకమైన పాత్రలు ఇచ్చిన ప్రతిసారీ అతను మెప్పిస్తుంటాడు. చిన్న చిన్న పాత్రలు చేస్తున్న సమయంలో ‘విక్రమార్కుడు’లో టిట్లా అనే భయంకరమైన పాత్ర ఇస్తే అందులో అదరగొట్టేశాడు అజయ్. కానీ అతడి టాలెంటుని మన దర్శకులు సరిగ్గా వాడుకున్నది తక్కువే. ఈ విషయమై అజయ్ కూడా చాలా బాధపడుతుంటాడు. కానీ తమిళ దర్శకుడైన విక్రమ్ కె.కుమార్‌కు మాత్రం అజయ్ మీద చాలా గురి ఉంది. తనకు తెలుగులో చాలా మంచి పేరు తెచ్చిపెట్టిన ‘ఇష్క్’లో అతడికి కీలక పాత్ర ఇచ్చి ప్రోత్సహించాడు. ఆ సినిమా అజయ్‌కి మంచి అప్లాజ్ తెచ్చింది. ఆ తర్వాత ‘24’ లాంటి ప్రెస్టీజియస్ ఫిలింలోనూ అజయ్‌కి ముఖ్య పాత్ర ఇచ్చాడు. అందులోనూ అతను ప్రూవ్ చేసుకున్నాడు.

ఇప్పుడు అఖిల్ హీరోగా తెరకరెక్కిస్తున్న ‘హలో’లోనూ అజయ్‌కి మంచి రోల్ దొరికిందట. ఈ పాత్రను అఖిల్ పరిచయం చేశాడు. ‘సే హలో టు బిగ్ బాస్’ అంటూ సినిమాలో అజయ్ పాత్రను పరిచయం చేశాడు. మరి అజయ్‌ని ‘బిగ్ బాస్’ అని ఎందుకన్నాడో.. సినిమాలో అతడి పాత్ర ఏంటో చూడాలి. అజయ్ లుక్ చూస్తే అదను ఇందులో రాయల్ క్యారెక్టరేదో చేస్తున్నట్లే ఉన్నాడు. విక్రమ్ లాంటి గ్రేట్ డైరెక్టర్ అజయ్‌కి ఇంత ప్రయారిటీ ఇస్తూ మంచి పాత్రలిస్తుంటే.. మన డైరెక్టర్లు మాత్రం అతడి టాలెంటుని సరిగా ఉపయోగించుకోవట్లేదనే చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు