ఆ ఘాటు వ్యాఖ్య‌లు... క‌మ‌ల్ కొంప‌ముంచేశాయే!

ఆ ఘాటు వ్యాఖ్య‌లు... క‌మ‌ల్ కొంప‌ముంచేశాయే!

ద‌క్షిణాది భాషా చిత్రాల్లో విల‌క్ష‌ణ న‌టుడిగా పేరుగాంచిన త‌మిళ న‌టుడు కమ‌ల్ హాస‌న్ ఇప్పుడు చిక్కుల్లో ప‌డిపోయారు. ఇటీవ‌లి కాలంలో రాజ‌కీయాల్లోకి వ‌చ్చేస్తున్నానంటూ ప‌లు సంద‌ర్భాల్లో ప్ర‌క‌టించిన క‌మ‌ల్‌... ఆయా సంద‌ర్భాల్లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌తో క‌మ‌ల్‌కు ఒక్క త‌మిళ‌నాడులోనే కాకుండా దేశ‌వ్యాప్తంగానూ మంచి పాపులారిటీనే ద‌క్కింది. అయితే ఆ పాపులారిటీ తెచ్చేసిన వ్యాఖ్య‌లే ఇప్పుడు ఆయ‌న‌పై కేసు న‌మోద‌య్యేలా చేశాయ‌ని చెప్పాలి. క‌మ‌ల్ చేసిన వ్యాఖ్య‌లకు సంబంధించి ఆయ‌న‌పై కేసులు న‌మోదు చేసి విచార‌ణ చేపట్టాల‌ని ఏకంగా మ‌ద్రాస్ హైకోర్టు చెన్నై పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాజకీయాల్లోకి దిగిపోయానంటూ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన క‌మ‌ల్‌... త‌న పార్టీ పేరును ప్ర‌క‌టించ‌క‌ముందే కేసులో ఇరుక్కున్న‌ట్టైంద‌న్న వాద‌న వినిపిస్తోంది.

అయినా క‌మ‌ల్ చాలా వ్యాఖ్య‌లే చేశారు క‌దా. ఆ వ్యాఖ్య‌ల్లోని ఏ కామెంట్ ఆధారంగా క‌మ‌ల్‌పై కేసు న‌మోదు చేయాల‌ని కోర్టు ఆదేశించిందంటే... ఇటీవ‌ల ఆయ‌న ఓ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. దేశంలో హింందూ ఉగ్ర‌వాదం ఉంద‌ని ప్ర‌క‌టించిన ఆయ‌న ఆ ఉగ్ర‌వాదం నానాటికీ పెచ్చ‌రిల్లుతోంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పై వెనువెంట‌నే కొన్ని వ‌ర్గాల నుంచి రియాక్ష‌న్ వినిపించినా...  క‌మ‌ల్ దానిని పెద్ద‌గా ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. అంతేకాకుండా త‌న‌పైకి ఓ పిల్లాడు పిస్ట‌ల్ గురిపెట్టిన‌ట్లుగా వెల‌సిన ఓ పోస్ట‌ర్‌ను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట‌ట్ చేసిన క‌మ‌ల్‌... అలాంటి ఏ పాపం ఎరుగ‌ని పిల్లాడి చేతిలో చ‌నిపోవ‌డం త‌న‌కు ఆనంద‌మేనంటూ మరో సంచ‌ల‌నాత్మ‌క కామెంట్ విసిరారు.

హిందూ ఉగ్ర‌వాదం అంటూ క‌మ‌ల్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇప్పుడు ఓ వ్య‌క్తి మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు.  తన వ్యాఖ్యల ద్వారా హిందువులపై ఉగ్రవాదులు అనే ముద్రను కమల్ వేశారంటూ పిటిషన‌ర్ కోర్టుకు విన్న‌వించాడు. హిందువులకు వ్యతిరేకంగా విషాన్ని వ్యాపింపజేసేందుకు క‌మ‌ల్‌ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఈ రోజు హిందువులను ఉగ్రవాదులు అన్నారని... రేపు, ముస్లింలను లేదా క్రిస్టియన్లను ఉగ్రవాదులు అంటారని తెలిపారు. పిటిష‌న‌ర్ వాద‌న‌తో ఆలోచ‌న‌లో ప‌డ్డ కోర్టు... కమల్ వ్యాఖ్యల్లో విచారించదగిన అంశాలున్నాయ‌ని, ఆయ‌న‌పై కేసు నమోదు చేయాలని చైన్నై నగర పోలీసులను ధ‌ర్మాస‌నం ఆదేశించంది. మ‌రి ఈ కేసు విచార‌ణ ఏ మ‌లుపులు తిరుగుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు