మణిరత్నం సినిమాకు పంచ్ పడిందే

మణిరత్నం సినిమాకు పంచ్ పడిందే

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఒక భారీ మల్టీస్టారర్ తీయడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబు, ఐశ్వర్యా రాజేష్, ప్రకాష్ రాజ్, జయసుధ.. ఇలా పెద్ద తారాగణమే సెట్ చేసుకున్నాడు ఈ సినిమా కోసం. ఈ చిత్రానికి ప్రి ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఇక షూటింగ్ మొదలవడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో పెద్ద చిక్కొచ్చిపడింది.

ఈ చిత్ర కథానాయకుల్లో ఒకడైన శింబు వివాదంలో చిక్కుకున్నాడు. ‘ఏఏఏ’ అనే సినిమా విషయంలో శింబు సహకరించకపోవడం వల్ల.. తాము చాలా నష్టపోయామని.. ఈ విషయంలో అతడిపై చర్యలు తీసుకోవాలని నడిగర్ సంఘానికి ఆ చిత్ర నిర్మాత ఫిర్యాదు చేశాడు. ఈ వివాదం తేలేవరకు శింబు మరే సినిమాలో నటించకుండా ఆదేశాలివ్వాలని ఆ నిర్మాత ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఇటీవల కొందరు నటీనటులపై తరచుగా ఇలాంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నడిగర్ సంఘం కూడా ఈ విషయాన్ని తీవ్రంగానే పరిగణిస్తున్నట్లు సమాచారం. శింబు మీద సస్పెన్షన్ విధించేందుకు ఆస్కారం ఉన్నట్లుగా కూడా కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే మణిరత్నం సినిమాకు ఇబ్బంది తప్పదు. శింబు ఒక్కడి కోసం షూటింగ్ వాయిదా వేయడమా.. లేదా మరో నటుడిని ఎంచుకుని సినిమా తీయడమా అన్నది మణిరత్నం తేల్చుకోవాల్సి ఉంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు