అయినా సెంటిమెంటును వదల్లేదే..

అయినా సెంటిమెంటును వదల్లేదే..

సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడైన హీరో.. తాను చేసిన చివరి నాలుగు సినిమాల్లో మూడింటిని ఒకే దర్శకుడితో చేయడం.. తన తర్వాతి సినిమాను కూడా మళ్లీ అదే దర్శకుడితో చేయడానికి ఓకే చెప్పడం విశేషమే. అజిత్ ఇలాగే చేశాడు. అతను చివరగా చేసిన నాలుగు సినిమాల్లో ఒక్క ‘ఎన్నై అరిందాల్’ను గౌతమ్‌తో చేశాడు. మిగతా మూడు సినిమాలు.. ‘వీరం’, ‘వేదాలం’, ‘వివేగం’ సినిమాలకు శివ దర్శకుడు. వీళ్లిద్దరూ కలిసి చేసిన చివరి సినిమా ‘వివేగం’ నిరాశ పరిచింది. ఓపెనింగ్స్ బాగున్నప్పటికీ చివరికి ఇది ఫ్లాప్ అనే తేలింది. అయినప్పటికీ మళ్లీ శివతోనే తన తర్వాతి సినిమా చేయడానికి నిర్ణయించుకున్నాడు అజిత్.

విశేషం ఏంటంటే.. అజిత్-శివ కాంబినేషన్లో వచ్చిన తొలి మూడు సినిమాల పేర్లలో ‘వి’ అక్షరాన్ని సెంటిమెంటుగా పెట్టుకున్నారు. ‘వివేగం’ తేడా కొట్టినా కూడా ఈ ‘వి’ సెంటిమెంటును కొనసాగించబోతున్నారు. వీళ్ల కలయికలో రాబోతున్న కొత్త సినిమాకు ‘విశ్వాసం’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఎ.ఎం.రత్నంకు చెందిన సత్యజ్యోతి ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మించబోతోంది. ఇంతకుముందు అజిత్‌తో ‘వేదాలం’, ‘ఎన్నై అరిందాల్’, ‘ఆరంభం’ సినిమాలు నిర్మించి మంచి ఫలితాన్నందుకున్నాడు రత్నం. ఈసారి కూడా యాక్షన్ బాటలోనే సాగబోతోంద అజిత్-శివ జోడీ. ఈ చిత్రానికి ఇంకా హీరోయిన్ ఖరారవ్వలేదు. త్వరలోనే షూటింగ్ ఆరంభం కాబోతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు