సురేందర్ రెడ్డి.. అతడిని వదలట్లేదే

సురేందర్ రెడ్డి.. అతడిని వదలట్లేదే

ఒక దర్శకుడు ఒక నటుడితో కనెక్టయితే.. మళ్లీ మళ్లీ అవకాశాలివ్వడం మామూలే. సురేందర్ రెడ్డి కూడా భోజ్ పురి స్టార్ నటుడు రవిశంకర్ విషయంలో అలాగే చేస్తున్నాడు. రవిశంకర్‌ను ‘రేసుగుర్రం’ సినిమాతో సురేందర్ రెడ్డి తెలుగు తెరకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో మద్దాలి శివారెడ్డిగా రవిశంకర్ అదరగొట్టేశాడు. ఒక్క సినిమాతో తెలుగులో ఫుల్ బిజీ అయిపోయాడు.

దీని తర్వాత సురేందర్.. తన ‘కిక్-2’లో కూడా రవిశంకర్‌నే విలన్‌గా పెట్టుకున్నాడు. కానీ ఆ సినిమా ఆడలేదు. ‘ధృవ’లో విలన్ పాత్రకు అరవింద్ స్వామి తప్ప వేరే ఛాయిస్ కనిపించలేదు సురేందర్‌కు. ఐతే ఆ సినిమా వరకు గ్యాప్ ఇచ్చి.. ఇప్పుడు మళ్లీ మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న ‘సైరా.. నరసింహారెడ్డి’లో రవిశంకర్‌కు మళ్లీ ఛాన్సిస్తున్నాడట ఈ దర్శకుడు.

‘సైరా’లో అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి లాంటి పేరున్న నటులు కీలక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీరితో పాటు టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ సైతం ఇందులో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నాడట. వీరికి రవిశంకర్ కూడా తోడవుతున్నట్లు తెలిసింది. అతడి పాత్ర కూడా సినిమాలో కీలకంగానే ఉంటుందట. ఈ చిత్రంలో నయనతార ఒక కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణే నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా డిసెంబరు 6న సెట్స్ మీదికి వెళ్లనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు