ఆ నిర్మాతలు గండం గట్టెక్కుతారా?

ఆ నిర్మాతలు గండం గట్టెక్కుతారా?

ఓ నిర్మాణ సంస్థ వరుసగా విజయాలు సాధించేయడం అంత తేలికైన విషయమేమీ కాదు. వరుసగా తాము నిర్మించిన తొలి ఆరు చిత్రాలను హిట్ చిత్రాలుగా నిలిపిన నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్. ప్రభాస్ సన్నిహితులు అయిన ప్రమోద్-వంశీలు.. యంగ్ రెబల్ స్టార్ తో తీసిన మిర్చి మూవీతో జర్నీ స్టార్ట్ చేసి.. తొలి ప్రయత్నంలోనే సూపర్ సక్సెస్ అయ్యారు.

ఆ తర్వాత శర్వానంద్ తో రన్ రాజా రన్.. గోపీచంద్ మూవీ జిల్.. నానితో భలేభలే మగాడివోయ్.. మరోసారి శర్వాతో ఎక్స్ ప్రెస్ రాజా.. మహానుభావుడు అంటూ ఇప్పటికే అరడజన్ సక్సెస్ లు ఈ నిర్మాతల ఖాతాలో పడిపోయాయి. మిర్చి మినహాయిస్తే.. ఇప్పటివరకూ ఫన్నీ కంటెంట్ ను నమ్ముకుని.. సరైన టైమింగ్ చూసుకుని బాగానే విజయాలు అందుకున్నారు. ఈ మధ్యన పండుగల సీజన్ ను కూడా ఉపయోగించుకోవడం అలవాటు అయిపోయింది. కాకపోతే.. ఈ నిర్మాతలు అసలు సిసలైన పరీక్ష ఇప్పుడే మొదలు కాబోతోంది.

వీరు తొలిసారిగా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ భాగమతిని నిర్మించారు. ఈ చిత్రాన్ని తమకు అచ్చొచ్చిన సంక్రాంతి రేస్ లో కూడా నిలిపారు. అనుష్క ప్రధానపాత్రలో నటించగా పీరియాడిక్ కాన్సెప్ట్ తో.. సోషల్ ఎలిమెంట్స్ తో కూడుకున్న భాగమతిపై అంచనాలతో పాటు అనుమానాలు కూడా ఉన్నాయి. అరుంధతి తర్వాత స్వీటీకి బోలెడంత ఇమేజ్ వచ్చింది కానీ..  సోలోగా సక్సెస్ సాధించడంలో మాత్రం విఫలమైంది. ఒక్కటంటే ఒక్క మూవీ కూడా విజయం లేదంటే ఆశ్చర్యం వేయక మానదు.

అసలే ట్రాక్ రికార్డ్ సరిగా లేదంటే..  పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి.. బాలయ్య జై సింహాలతో పాటు పలు చిత్రాలతో పోటీ పడి మరీ భాగమతి సక్సెస్ కొట్టాల్సి ఉంది. అశోక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై 40 కోట్ల పెట్టుబడి చేసింది యూవీ క్రియేషన్స్. ఈ మొత్తం రాబట్టుకుని మూడో హ్యాట్రిక్ ను మొదలుపెట్టగలిగితే.. ఈ నిర్మాతలు గండం గట్టెక్కినట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు